సాధారణంగా ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లొస్తాయి.. కానీ కేరళలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మాత్రం మద్యం వస్తోంది. త్రిస్సూర్ జిల్లా చలక్కుడిలోని 'న్యూ సోలోమాన్ అపార్ట్‌మెంట్'లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరి ఇళ్లల్లో మంచినీటి పైప్‌లైన్‌లో నీటికి బదులు మద్యం పారుతోంది. అందుకే ఈ అపార్ట్‌మెంట్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తూ.. సంచలనానికి కేంద్రంగా మారింది.
ఇలా వస్తోంది...
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు ట్యాపుల్లో మద్యం ఎలా వస్తుందా? అని ఆరా తీశారు. ఆరేళ్ల క్రితం అపార్ట్‌మెంట్ సమీపంలో ఒక బార్ ఉండేదని.. బార్‌లో అక్రమంగా వేల లీటర్ల మద్యాన్ని నిల్వ చేసినందున.. మద్యాన్ని పారబోయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్వర్వులతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు, అధికారులు బార్ ప్రాంగణంలో గొయ్యి తవ్వి మద్యాన్ని పారబోశారు. అలా పారబోసిన లిక్కరే.. ప్రస్తుతం నీటి పైపుల్లో నుంచి అపార్ట్‌మెంట్ ట్యాపుల్లోకి చేరిందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం అపార్ట్మెంట్లోని వారికి తాత్కాలికంగా మంచినీటి సరఫరా కొరకు 5వేల లీటర్ల సామర్థ్యమున్న ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే మద్యం వస్తున్న బోరుబావిని కూడా శుద్ధి చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: సరోగసీలో భారీ మార్పులు.. అద్దె గర్భం మరింత సులభం