ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలని పార్లమెంటును కోరుతూ ఈ ఏడాది జనవరి 27న రాష్ట్ర శాసన సభ సాధికార తీర్మానం ఆమోదించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి- ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్.టి. రామారావు చూపిన బాటలో నడవటం చిత్రమైన పరిణామం. అన్నట్టు 1985లో ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేయగా, జగన్ తండ్రి అయిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2007లో దాన్ని పునరుద్ధరించారు. మండలి ప్రస్థానంలో అది మరొక చిత్రమైన మలుపు. మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర శాసన మండలి వల్ల ఖర్చు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదనీ, అదొక తెల్ల ఏనుగులా తయారైందని వ్యాఖ్యానించారు. 2020 ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ- అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లునూ, 2020 ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్డీఏ) రద్దు బిల్లునూ అడ్డుకోవడం ద్వారా శాసన మండలి రాష్ట్ర సమతుల అభివృద్ధికి అవరోధంగా మారుతోందని ఆయన విరుచుకుపడ్డారు.
తెలంగాణ విడివడిన తరవాత ఆంధ్రప్రదేశ్‌కు సకల హంగులతో కూడిన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఈ బృహత్తర ప్రాజెక్టును ఏపీసీఆర్డీఏ రద్దు బిల్లు కృష్ణలో కలిపేసింది. జగన్ ప్రభుత్వం తెచ్చిన మొదటి బిల్లు అమరావతిని శాసన రాజధానిగా అట్టిపెట్టి, విశాఖపట్టణాన్ని పాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. దీన్ని అభివృద్ధి వికేంద్రీకరణగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వర్ణిస్తోంది. పై రెండు బిల్లులను శాసన సభ ఆమోదించి శాసన మండలికి పంపగా, మండలి వాటిని సెలక్ట్ కమిటీ పరిశీలనకు అందించింది.
అప్పుడు ఎన్.టీ.ఆర్.. ఇప్పుడు జగన్
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, అనేక ఇతర రాష్టాల్లో కూడా శాసన మండళ్ల పరిస్థితి ఎన్నడూ తిన్నగా లేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ తీర్మానాన్ని అనుసరించి 1958లో శాసన మండలి ఏర్పడింది. 1985లో దాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు రద్దు చేశారు. శాసన మండలి వల్ల ఖజానాకు అనవసర భారమే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని ఆయన అన్నారు. ప్రజలు మండలి సభ్యులను నేరుగా ఎన్నుకోరనీ, ఆ సభ్యులు ప్రజలకు నిజమైన ప్రతినిధులు కారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. శాసన మండలి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా ఉపయోగపడటమే కాదు, ప్రజోపయోగకరమైన కీలక బిల్లులకు మోకాలడ్డుతోందని కూడా ఆయన అప్పట్లో విమర్శించారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ సరిగ్గా అలాంటి వాదనలనే తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ రద్దు చేసిన శాసన మండలిని జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2007లో పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
శాసన ప్రక్రియకు ఆటంకము
శాసన మండళ్ల వ్యవహారం ‘ఒలకబోయడం మళ్లీ ఎత్తిపోసుకోవడం’ చందంగా తయారవడానికి మూల కారణం- అసలు రాజ్యాంగంలో శాసన మండలికి సంబంధించి పటిష్ఠమైన ఏర్పాటు లేకపోవడమే. పార్లమెంటులో దిగువ సభ (లోక్ సభ), ఎగువ సభ (రాజ్య సభ) ఉంటాయని స్పష్టంగా పేర్కొన్న రాజ్యాంగం, రాష్ట్రాలకు శాసన మండళ్లు ఉండి తీరాలని ఎక్కడా నిర్దేశించలేదు. ఏదైనా రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు లేదా రద్దుకు పార్లమెంటు చట్టం ‘చేయవచ్చు’నని 169వ రాజ్యాంగ అధికరణలోని 1వ క్లాజు పేర్కొంటోంది. ‘చేయవచ్చు’ అనడంలో ఉద్దేశం- చట్టం చేయాలో వద్దో తేల్చుకునే అధికారం పార్లమెంటుకు ఉందని! శాసనమండలి సృష్టి లేదా రద్దుకు పార్లమెంటు చట్టం చేయనూవచ్చు, చేయకపోనూవచ్చన్నమాట. అంతా పార్లమెంటు ఇష్టానికే రాజ్యాంగం వదిలేసింది. పార్లమెంటు ఇలాంటి చట్టం చేయాలంటే, మొదట రాష్ట్ర శాసన సభ ప్రత్యేక మెజారిటీతో శాసన మండలి రద్దుకు తీర్మానించాలి.
శాసన సభ మొత్తం సంఖ్యాబలంలో అత్యధికులు రద్దు తీర్మానాన్ని ఆమోదించాలి. అంతేకాక, ఓటింగ్‌లో పాల్గొన్నవారిలోనూ మూడింట రెండువంతులమంది ఆమోదముద్ర వేయాలి. మండలి రద్దు, సృష్టి అనేవి సంబంధిత రాష్ట్ర ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ మేరకు రాష్ట్రం పంపే తీర్మానానికి పార్లమెంటు ఆమోదం తెలపవచ్చు, తెలపకపోవచ్చు. అంతా ఐచ్ఛికమే. రెండు సభలు ఉన్న రాష్ట్రాల పేర్లను 168వ రాజ్యాంగ అధికరణ ఉటంకిస్తోంది కనుక, మండలి రద్దు లేక సృష్టి జరిగినప్పుడల్లా సదరు అధికరణను చీటికిమాటికి సవరించాల్సి వస్తుంది. ఏదైనా రాష్ట్రంలో శాసనమండలి రద్దయితే 168వ అధికరణ నుంచి ఆ రాష్ట్రం పేరును తీసేయాలి. ఒకవేళ మరో రాష్ట్రం కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేసుకుంటే, దాని పేరు చేర్చడానికి 168వ అధికరణను మళ్లీ సవరించాల్సి వస్తుంది. ఈ మార్పుచేర్పులు చేయడానికి 368వ అధికరణలో ఉల్లేఖించిన ప్రక్రియను పాటించనక్కర్లేదని 169వ అధికరణలోని మూడవ క్లాజు పేర్కొంటోంది.
శాసన నిర్మాణ ప్రక్రియకు వస్తే రాజ్య సభకూ శాసన మండలికీ పోలికలు ఉన్నాయి. ద్రవ్య బిల్లు మినహా ఇతర బిల్లులకు ఈ రెండు సభల ఆమోదం కావాలి. అయితే సదరు బిల్లులను సవరించడానికీ, తోసిపుచ్చడానికీ రాజ్య సభకు ఉన్న అధికారాలు శాసన మండలికి లేవు. ఒకవేళ మండలి ఏదైనా సవరణలు ప్రతిపాదించినా వాటిని శాసన సభ ఆమోదించనక్కర్లేదు. మండలి సంబంధిత బిల్లును తిరస్కరించినా, మూడు నెలలపాటు బిల్లు సంగతి తేల్చకపోయినా విధాన సభ మళ్లీ సమావేశమై ఆ బిల్లును ఆమోదించి మండలికి తిప్పి పంపవచ్చు. ఈసారి కూడా మండలి సదరు బిల్లును తిరస్కరించవచ్చు. లేక శాసన సభకు ఆమోదనీయం కాని సవరణలు చేసి బిల్లును ఆమోదించవచ్చు. అదీకాకుంటే నెలరోజులపాటు బిల్లును ఆమోదించకుండా, తోసిపుచ్చకుండా పరిశీలనలో ఉంచవచ్చు. ఈ మూడింటిలో ఏది జరిగినా శాసన సభ రెండోసారి ఆమోదించిన రూపంలో బిల్లును రెండు సభలూ ఆమోదించినట్లు పరిగణిస్తారు. బిల్లు పరిశీలన, ఆమోదం కోసం శాసన మండలికి మాత్రమే మూడు నాలుగు నెలల కాలపరిమితి నిర్దేశించారు. శాసన సభకు అలాంటి పరిమితి లేదు. కానీ, ఇలాంటి కాలపరిమితి పార్లమెంటు ఉభయ సభలకూ వర్తిస్తుంది. ఏదైనా బిల్లుపై భేదాభిప్రాయాల పరిష్కారానికి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించడానికి 108వ రాజ్యాంగ అధికరణ వీలు కల్పిస్తోంది.
విలక్షణం.. రాజ్యసభ!
పార్లమెంటులో ఒక సభ ఆమోదించిన బిల్లును నిర్దేశిత కాలపరిమితి లోపల రెండో సభ ఆమోదించకపోతే సంయుక్త సమావేశాన్ని ఏర్పరచి వ్యవహారం తేల్చవచ్చు. కానీ, శాసన సభ, మండలి సంయుక్త సమావేశం జరుపుకొని బిల్లు వ్యవహారాన్ని తేల్చడానికి రాజ్యాంగం వీలు కల్పించడం లేదు. పార్లమెంటుకు, రాష్ట్ర లెజిస్లేచర్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఇది! రాష్ట్రాల లెజిస్లేచర్లలో శాసన సభ, మండళ్లకు సమాన హక్కులు, అధికారాలు లేవు. శాసన మండలి ఆమోదించి పంపిన బిల్లును శాసన సభ ఆమోదించకపోతే, ఆ బిల్లు అంతటితో చెల్లు. అదే శాసన సభ పంపిన బిల్లును మండలి ఆమోదించకపోతే, సదరు బిల్లు రద్దయిపోదు. రాష్ట్ర శాసన మండలి కూర్పును పార్లమెంటు ఒక చట్టం ద్వారా మార్చవచ్చు. అదే రాజ్య సభ కూర్పు విషయానికి వస్తే, అది ఎలా జరగాలో రాజ్యాంగమే నిర్దేశించింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను ఎన్నుకునే నియోజక గణంలో రాజ్యసభ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు కానీ, శాసన మండలి సభ్యులకు ఆ అవకాశం ఉండదు. శాసన మండలి అవసరమా కాదా అనే అంశంపై రాజ్యాంగ నిర్మాణ సభలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలే రాజ్యాంగ నిబంధనల్లోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. శాసనమండలి సభ్యులు ప్రజలు ఎన్నుకున్నవారు కాదు కాబట్టి, వారి వల్ల శాసన ప్రక్రియ ఆలస్యం కావచ్చని రాజ్యాంగ నిర్మాతలు కొందరు భావించారు. మండలి వల్ల అనవసర ఖర్చే తప్ప ఎలాంటి ఉపయోగమూ ఉండదన్నారు. మండలిపై అలనాడు ఎన్.టి.రామారావు ఇవే విమర్శలు చేశారు. నేడు జగన్మోహన్ రెడ్డీ అవే బాణాలు ఎక్కుపెట్టారు.
ఆరు రాష్ట్రాలకే పరిమితం..
గతేడాది జమ్మూకశ్మీర్ శాసన మండలిని రద్దు చేసిన తరవాత నేడు కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి. అవి- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్ ప్రదేశ్. మధ్యప్రదేశ్‌లో శాసన మండలి ఏర్పాటుకు 1956లో చట్టం చేసినా, దాని అమలుకు ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. రాజస్థాన్, అసోమ్‌లలో శాసన మండళ్ల ఏర్పాటు ప్రతిపాదనలు పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. స్వాత్రంత్య్రం వచ్చినప్పటి నుంచి మొదట శాసన మండళ్లు ఏర్పాటై, తరవాత రద్దయిన రాష్ట్రాలు- పంజాబ్ (1970), తమిళనాడు (1986), పశ్చిమ్ బంగ (1969). తమిళనాడు శాసన మండలిని పునరుద్ధరించడానికి ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం చేసి పంపగా, దాని అమలు కోసం 2010లో పార్లమెంటు ఒక చట్టం చేసింది. దాన్ని నోటిఫై చేసే లోపే తమిళనాడులో ప్రభుత్వం మారింది. ఈసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మళ్లీ శాసన మండలిని రద్దు చేయాలని నిశ్చయించి, 2011లో ఆ మేరకు తీర్మానం ఆమోదించింది. తదనుగుణంగా తమిళనాడు శాసన మండలి రద్దు బిల్లును 2012 మే 4వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ పరిణామాల వల్ల తమిళనాడుకు ఇంతవరకు శాసన మండలి ఏర్పడనే లేదు.
(వ్యాసంలో రెండో భాగం రేపు..)
- వివేక్ కే. అగ్నిహోత్రి
(రచయిత-రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్)
ఇదీ చదవండి:ఈ 'భీముడి' విలువ అక్షరాలా రూ.14 కోట్లు!