వివేక్ జోషి... రెండుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న వ్యక్తి. ప్రత్యేక అవసరాలున్న వారికి విమానాశ్రయాల్లో కల్పించాల్సిన సదుపాయాల కోసం, తమ హక్కుల కోసం పోరాడిన వారిలో ఒకరు. ఆయన మాట్లాడలేరు, సరిగ్గా నడవలేరు. అయినా.. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ పూర్తిచేశారు. పీహెచ్డీ చేస్తూ.. విధికే ఎదురీది, ఆదర్శంగా నిలుస్తున్నారు వివేక్ జోషి.
ఇద్దరు రాష్ట్రపతుల చేతుల మీదుగా..
దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నందుకు.. దేశ రాష్ట్రపతులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా సత్కారాలు అందుకున్నారు వివేక్. దివ్యాంగులు కూడా మామూలు జీవితం గడిపేలా చేయాలన్న లక్ష్యం నేరవేర్చుకునేందుకు వివేక్‌కు సహకరించిన ఆయన తల్లి కౌసల్యాదేవిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సత్కరించారు.
జీవితాన్ని మార్చిన ఘటన
ముంబయి విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన.. వివేక్ జీవితాన్ని మార్చింది. తనలాంటి ఎంతోమంది దివ్యాంగుల హక్కుల కోసం పోరాడేందుకు కారణమైంది. అందుకు కావల్సిన ధైర్యాన్ని తనలో నింపింది. ఆ ఘటనను గురించి వివేక్ గుర్తుచేసుకున్నారు.
"ముంబయి విమానాశ్రయంలో నాతో, మా నాన్నతో అనుచితంగా ప్రవర్తించారు. ప్రత్యేక సదుపాయాల కోసం రూ.1,185 కట్టమన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం... దివ్యాంగుల కోసం సదుపాయాలు కల్పించాలి. కానీ అలా జరగలేదు. మా నాన్నతో ఎయిర్ ఇండియా సిబ్బంది వాదనకు దిగారు. మా సమయం వృథా చేయడమే కాక, ఏ కారణమూ లేకుండా మా నాన్నతో అనవసరపు చర్చ పెట్టారు."
- వివేక్ జోషి
కష్టానికి దక్కిన ప్రతిఫలం
విమానాశ్రయంలో తమ హక్కుల గురించి మాట్లాడినప్పుడు వివేక్ జోషి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆయన మాటలను పరిగణించిన ఎయిర్ ఇండియా.. ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికులు, వృద్ధుల సౌకర్యార్థం ప్రత్యేక సూచనలు జారీ చేసింది.
"ఆ నిర్ణయం ఆమోదించదగినది. దివ్యాంగులు, వృద్ధులు ఇప్పుడు చక్రాల కుర్చీ కోసం డబ్బులు కట్టనవసరం లేదు. అలాంటి ప్రయాణికులను టాక్సీ స్టాండ్ వరకు ఎయిర్ ఇండియా సిబ్బంది తీసుకుని వెళ్లాలి."
- వివేక్ జోషి
తండ్రి అండతో
మంచి ఆశయంతో వివేక్ చేసిన ఈ పోరాటంలో ఆయన తండ్రి కూడా పాలుపంచుకున్నారు. ముంబయి విమానాశ్రయంలో జరిగిన వాగ్వాదంలో తాను గెలవడం వల్ల.. దివ్యాంగులు, వృద్ధులకే గెలుపు దక్కిందని అంటున్నారు.
"దిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే ఫిర్యాదు చేశాం. మీడియా మాకు సహకరించింది. దివ్యాంగులు, వృద్ధులు విమానాలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూడదని, వారితో సరిగా ప్రవర్తించాలని ఎయిర్ ఇండియా నియమాలు జారీ చేసినట్లు ఇటీవలే తెలిసింది."
- సుభాష్ జోషి, వివేక్ తండ్రి
మనతో పాటు నలుగురికీ సాయం చేసినప్పుడే జీవితానికి అర్థం ఉంటుందని అంటారు. ఆ మాటకు వివేక్ జోషి, ఆయన తండ్రి ఉదాహరణగా నిలుస్తున్నారు. హక్కుల కోసం గొంతెత్తేలా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి: డ్యూటీ కోసం ఇద్దరు మహిళల సాహసం