మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాల్‌ఠాక్రే తనయుడు, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. బాల్ ఠాక్రే పలు కీలక ప్రసంగాలు చేసిన దాదర్‌లోని శివాజీపార్క్‌లో ఉద్ధవ్ సీఎంగా ప్రమాణం చేశారు. మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీల కీలక నేతలు, శివసేన కార్యకర్తల కోలాహలం నడుమ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఉద్ధవ్ ఠాక్రేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరిస్తూ దైవసాక్షిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేశారు.
ఆరుగురితో మంత్రివర్గం
శివసేన నుంచి ఆ పార్టీ శాసనసభాపక్షనేత ఏక్‌నాథ్ శిందే, సుభాష్ దేశాయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్సీపీ నుంచి ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్ ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రముఖుల హాజరు
ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి డీఎంకే అధినేత స్టాలిన్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అజిత్ పవార్ హాజరయ్యారు. వీరితోపాటు భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుటుంబం, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఉద్ధవ్ ప్రమాణానికి... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దూరంగా ఉన్నారు. ఉద్ధవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు పంపారు.
ఠాక్రే కుటుంబం నుంచి తొలి వ్యక్తి
ఠాక్రే కుటుంబం నుంచి ప్రభుత్వంలో పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా.. ఉద్ధవ్ నిలిచారు. శివసేన నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడోవ్యక్తిగా ఉద్ధవ్ గుర్తింపు పొందారు. గతంలో మనోహర్‌జోషి, నారాయణ్‌రాణే శివసేన నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఉద్ధవ్ ఠాక్రే.. శాసనసభకు, శాసనమండలికి ఎన్నిక కాకుండానే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిదో వ్యక్తి.