కశ్మీర్లో మరోసారి ముష్కరులు దాడికి పాల్పడారు. షోపియాన్ జిల్లాలో యాపిల్స్‌ను లోడ్ చేయటానికి వెళ్లిన ట్రక్కులపై ముష్కరులు దాడి చేయగా ఇద్దరు చోదకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గడిచిన 10 రోజుల్లో ఇది మూడో ఘటనని అధికారులు తెలిపారు. ట్రక్ డ్రైవర్లు... భద్రతా దళాలకు సమాచారం ఇవ్వకుండా వెళ్లారని అధికారులు వెల్లడించారు.
ఇదీ జరిగింది...
యాపిల్ కోసం కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని చిత్తార్గామ్ గ్రామానికి వెళ్లిన మూడు ట్రక్కులపై ముష్కరులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఉగ్రవాదులు దాడి చేయగానే చోదకులు పారిపోవటానికి ప్రయత్నించగా.. వారిని తుపాకితో కాల్చి చంపి తర్వాత రెండు ట్రక్కులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ముష్కరులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఒకరు రాజస్థాన్ అల్వార్‌కు చెందిన మహ్మద్. గాయపడిన మరో వ్యక్తిని పంజాబ్ హోషియార్‌పూర్‌కు చెందిన జీవన్‌గా పోలీసులు గుర్తించారు. మరోక వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉంది.
అక్టోబర్ 14న...
అక్టోబర్ 14న ఇద్దరు ఉగ్రవాదులు షోపియాన్ జిల్లాలోని పండ్ల వ్యాపారిపై దాడి చేసి, రాజస్థాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్‌ను కాల్చి చంపారు. రెండు రోజుల తర్వాత షోపియాన్‌లో పంజాబ్‌కు చెందిన యాపిల్ వ్యాపారి చరణ్‌జిత్ సింగ్‌ను కాల్చి చంపారు. ఈ దాడిలో సంజీవ్ అనే మరో వ్యక్తి గాయపడ్డాడు.