నిర్భయ దోషులకు దిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన అనంతరం.. ఉరి శిక్ష అమలు ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు మరణ శిక్ష అమలు చేయాలని దిల్లీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అందులో భాగంగానే మరణ శిక్ష అమలుకు కసరత్తు మొదలైంది. ఉరి శిక్ష విధించేందుకు జైలు సిబ్బంది ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తిహార్ జైలు అధికారులు వెల్లడించారు.
2013లో పార్లమెంటుపై దాడి దోషి అఫ్జల్ గురును ఉరి తీసిన జైలు నెంబర్ 3లోనే నిర్భయ దోషులకు మరణ శిక్ష అమలు చేయనున్నారు.
''రాబోయే రోజుల్లో దోషులకు ఉరి శిక్షపై ట్రయల్స్ నిర్వహిస్తాం. కానీ ఈ రోజు కాదు. మూడో నెంబర్ జైల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది.''
- తిహార్ జైలు అధికారి
దోషులు ఎంత బరువు ఉంటారో అంత బరువు ఉండే వస్తువులను ఉపయోగించి ఉరి ట్రయల్స్ వేయనున్నారు. అయితే ఇవి ఎప్పుడు నిర్వహించేది మాత్రం అధికారులు తెలియజేయలేదు. ఈ డమ్మీ ప్రక్రియలో ప్రజా పనుల శాఖ అధికారులు, జైలు సూపరింటెండెంట్, ఇతర అధికారులు పాల్గొననున్నారు.
బక్సర్ ఉరి తాళ్లు.. మేరఠ్ తలారి..
ఉరి తాళ్లు తయారు చేయాల్సిందిగా బిహార్లోని బక్సర్ జైలుకు ఎప్పుడో ఆదేశాలు వెళ్లాయి. ఉరి తాళ్ల తయారీలో బక్సర్ జైలుకు మంచి పేరు ఉంది.
నేను రెడీ..
తలారి కోసం ఇప్పటికే తిహార్ సిబ్బంది.. ఉత్తర్ప్రదేశ్ మేరఠ్ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో అక్కడి తలారి పవన్ జల్లాద్ ఈ ప్రక్రియకు సిద్ధమే అంటున్నాడు.
''ఈ ప్రక్రియ చేపట్టాలని.. నాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు. నన్నెవరూ సంప్రదించలేదు. ఎవరైనా అడిగితే.. నేను దీనికి సిద్ధమే. డిసెంబర్ 16నే నేను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాను.''
- పవన్ జల్లాద్, మేరఠ్ తలారి