ఎన్నాళ్లిలా? బయటకు వెళ్లడానికి భయపడుతూ..అవతలివారితో మాట్లాడడానికి భయపడుతూ..ఎన్నాళ్లిలా? కరోనా సాధారణ జనజీవితాన్ని స్తంభింపచేసింది. స్వేచ్ఛగా తిరగనీయకుండా చేసింది. కానీ బతుకు చక్రం ఆగదు. తిరుగుతూనే ఉండాలి. అందుకే ఈ భయం నుంచి, ఈ అవసరం నుంచి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. రోజువారీ జీవనం సాఫీగా సాగిపోయేందుకు దోహదపడే సాంకేతిక పరిజ్ఞానాలు ఆగమేఘాల మీద పుట్టుకొస్తున్నాయి. ఇవిగో ఇవి ఇలాంటి మార్పులే.
స్మార్ట్ ఫేస్‌మాస్క్
![Technical protection](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8599155_876_8599155_1598667923297.png)
మాస్క్‌లా ముఖానికి పెట్టుకునే ఎయిర్‌ఫ్యూరిఫయర్ ఇది. దీన్ని ఈ ఏడాది చివరి త్రైమాసికంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎల్‌జీ ప్రకటించింది. ఈ మాస్క్‌లో ఉండే రెండు హెచ్13 హెపా ఫిల్టర్లు గాలిని స్వచ్ఛపరుస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. ఇందులోనే రెండు ఫ్యాన్లుంటాయి. గాలి పీల్చుకోవడం, వదలడం సహజసిద్ధంగా ఉండేలా ఇవి సహకరిస్తాయని పేర్కొంది. ఇందులో ఒక సెన్సర్ కూడా ఉంటుంది. శ్వాసరేటును ఇది గుర్తిస్తుంది. బ్యాటరీతో పని చేస్తుంది. ఫిల్టర్లను మార్చుకోవాల్సి వచ్చినప్పుడు థిన్‌క్యూ యాప్‌ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ మాస్క్ లోపలికి పీల్చుకునే గాలిని వడపోస్తుందా? బయటకు వదిలే గాలినా అన్న విషయాన్ని ఎల్‌జీ ప్రకటించలేదు. ధర కూడా ప్రకటించలేదు. ఇలాంటి మాస్కులను అభివృద్ది చేస్తున్నట్లు ఇప్పటికే టీసీఎల్, షియోమీ ప్రకటించాయి.
సరికొత్తగా బస్సు
![Technical protection](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8599155_733_8599155_1598667962261.png)
భారత్, ఇంకా పలు దేశాల్లో ప్రజారవాణా పూర్తిగా తెరచుకోలేదు. ఈ రంగం పరిమితంగానే పని చేస్తోంది. ప్రస్తుత ప్రజారవాణా డిజైన్.. అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించేవిధంగా లేదు. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ విద్యార్థి రియాన్ టియో సహా అంతర్జాతీయ బృందమొకటి ‘ఫ్యూచర్ బస్’ను డిజైన్ చేసింది. షాంఘై టాంగ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పోటీలో ఈ డిజైన్ మొదటి బహుమతి సాధించింది. ప్రస్తుతం చాలా బస్సుల్లో ఎక్కే ద్వారం, దిగే ద్వారం చిన్నగా ఉంటున్నాయి. బస్సు పొడవునా తెరుచుకునేలా కొత్త డిజైన్‌ను రూపొందించారు. అంటే ఒకరినొకరు తాకకుండానే బస్సు ఎక్కొచ్చు, దిగొచ్చు. బస్సులో పట్టుకునే హ్యాండిళ్లు యూవీ కాంతితో స్టెరిలైజ్ అవుతాయి. స్టీల్‌తో తయారుచేసే ఈ హ్యాండిళ్లపై ఎప్పటికప్పుడు తొలగించుకునే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. హ్యాండిల్ వెనక యూవీ కాంతిని వెలువరించే ఉపకరణం ఉంటుంది. బస్సు ఆగినప్పుడల్లా ఈ హ్యాండిల్ నిదానంగా 360 డిగ్రీలు తిరుగుతుంది. దానిపై యూవీ కాంతి ప్రసరించి బ్యాక్టీరియా, వైరస్‌లాంటి వాటిని నాశనం చేస్తుంది. పక్కపక్కనే ఉండే సీట్ల మధ్య అడ్డుతెరలాంటి ఏర్పాటు ఉంటుంది. సీట్లకవర్‌పై రాగిపూత పూసిన వస్త్రాన్ని వాడతారు.
టాయిలెట్ సీట్లు
![Technical protection](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8599155_268_8599155_1598667996391.png)
పబ్లిక్ టాయిలెట్లు సూక్ష్మక్రిములకు ఆలవాలం. ఒకరు ఉపయోగించిన ఉపరితలంపైనే మరొకరు కూర్చోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త టాయిలెట్ సీట్‌కవర్ ఉంటే! ఇలాంటి పరిజ్ఞానమూ అందుబాటులో ఉంది. కమోడ్‌కు అదనంగా ఒక ఉపకరణాన్ని బిగించుకుంటే సీటు ఉపరితలానికి ప్లాస్టిక్ కవర్ ఆటోమేటిక్‌గా చుట్టుకుంటుంది. సెన్సర్ ఆధారంగా ఇది పని చేస్తుంది. ఉపయోగం అయిపోయిన తర్వాత ఆ కవర్.. ఉపకరణం లోపలికి వెళ్లిపోతుంది. లోపల చిన్న చిన్న ముక్కలుగా తెగిపోతుంది. సెన్సర్ వద్ద చేయిపెట్టగానే కొత్త కవర్ వచ్చి ఉపరితలానికి చుట్టుకుంటుంది.
ఎస్కలేటర్లు క్రిమిరహితం
![Technical protection](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8599155_160_8599155_1598668036957.png)
విమానాశ్రయాల్లో, పెద్ద పెద్ద మాల్స్‌లో ఎస్కలేటర్ల వినియోగం తప్పనిసరి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాటిని పట్టుకోవడం అనివార్యం. వీటిల్లో ఎల్‌ఈడీ యూవీ-సి ఉపకరణాన్ని బిగిస్తున్నారు. ఎస్కలేటర్‌ను పట్టుకున్న తర్వాత ప్రతిసారీ ఈ ఉపకరణం ఎస్కలేటర్ హ్యాండ్‌రెయిల్ ఉపరితలాన్ని డిస్‌ఇన్ఫెక్ట్ చేస్తుంది.