అయోధ్యలో మసీదు నిర్మాణంపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. అయోధ్య పురపాలక పరిధి దాటిన తర్వాతే మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేసింది.
రామ మందిర నిర్మాణ ట్రస్టులో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు నేతృత్వ బాధ్యతలు అప్పగించొద్దని వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు చంపత్‌రాయ్ కోరారు.
పాత ఆయోధ్యలో..
2018 డిసెంబర్ వరకు అయోధ్య చిన్న పురపాలక పట్టణం. ఆ తర్వాత ఆయోధ్య-ఫైజాబాద్ పురపాలక పట్టణాలు కలిసిపోయాయి. అయితే మసీదు నిర్మాణానికి పాత అయోధ్య పరిధి బయట ఐదెకరాల భూమి కేటాయించాలని చంపత్‌రాయ్ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది ట్రస్టు..
రామ మందిర నిర్మాణ ట్రస్ట్‌కు మోహన్ భగవత్ నేతృత్వం వహించనున్నారనే అంశంపై స్పందిస్తూ.. 'అది ఎన్నటికీ జరగదు' అని చెప్పారు చంపత్‌రాయ్. 2020 జనవరిలో రామ మందిర నిర్మాణ ట్రస్టు ఏర్పాటు కావచ్చని తెలిపారు.
ఏళ్ల తరబడి సాగిన అయోధ్య భూవివాదం కేసులో నవంబర్ 9న సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి కేటాయించింది. అయితే అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరైనా ఈ భూమిని ఇవ్వాలని ఆదేశించింది.
రివ్యూ వారి హక్కు..
అయోధ్య భూవివాదం కేసులో సుప్రీం తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపైనా చంపత్‌రాయ్ స్పందించారు. 'అది వారి హక్కు' అని పేర్కొన్నారు. దాని ప్రభావం తమపై పెద్దగా ఉండదని తెలిపారు.
ఇదీ చూడండి:'ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరస్థులకు చట్టమంటే భయమే లేదు'