'ఆ.. అరటి పండ్లు బాబు అరటి పండ్లు.. కల్లోలాలు సృష్టించేవారికి అరడజను.. హింసను ప్రేరేపించేవారికి డజను అరటి పళ్లు ఫ్రీ బాబు.... ఎక్కడ దాక్కున్నా ఫరవాలేదు బాబు... అరటి పండు వలిచినట్లు మీ తాట తీస్తాం బాబు'! ఇదీ.. అరటి పండ్ల బండిని తోస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ తోమర్ మనసులో మాట.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల పేరుతో హింసను ప్రేరేపిస్తున్న వారి ఆట కట్టించేందుకు.. ఇలా అరటి పండ్ల వ్యాపారి వ్యూహంతో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు.
ఆగ్రాలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని, ఫిరోజాబాద్ సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు వినూత్న ఉపాయాన్ని అమలు చేశారు ఎస్ఐ సునీల్. అరటి పళ్ల వ్యాపారిగా మారి దుండగులను కనిపెట్టి, అరెస్ట్ చేశారు.
'ఆగ్రాలో కొందరు యువకులు కాస్త తేడాగా మాట్లాడుతున్నట్లు మాకు అనిపించింది. వారు ఇక్కడి వారు కాదు. బయట నుంచి వచ్చి ఉంటారని అనుమానం వచ్చింది. అప్పుడే, వారి వివరాలు కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేశాం. కానీ, వాళ్లు మా పోలీసు దుస్తులు చూసి జాగ్రత్తపడేవారు. అందుకే జనాల్లో కలిసిపోయి కనిపెట్టాలని నిర్ణయించాం. పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాం. తరువాత ఓ అరటి పళ్ల బండి సిద్ధం చేశాం, మీసాలు తీసేశాను, వేషం మార్చేశాను. ఆ ప్రాంతంలో చాలా సేపు తిరిగి వారి కదలికలను గమనించాం. ఎట్టకేలకు విజయం సాధించాం. '
-సునీల్ తోమర్, ఎస్ఐ
అరెస్టయిన వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు సునీల్.
ఇదీ చదవండి:ఎమ్మెల్యేను కలిసేందుకు 90 కి.మీ పాదయాత్ర