కేరళలోని వయనాడ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సుల్తాన్ బేతరీ ప్రాంతంలో పాము కాటుకు ఓ పదేళ్ల విద్యార్థిని తరగతి గదిలోనే ప్రాణాలు వదిలింది.
పాము కరిచినా ఉపాధ్యాయురాలు ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా పాఠాలు కొనసాగించారని తోటి విద్యార్ధులు ఆరోపించారు. పాప తండ్రి వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రాణాలు దక్కలేదు.
మొదట చిన్నారిని ఓ స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు కోజికోడ్ వైద్య కళాశాలకు తీసుకువెళ్లాలని సూచించారు.
చిన్నారి మృతితో ఆగ్రహించిన స్థానికులు పాఠశాల సిబ్బందిపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
బాలిక మృతిపై కేరళ విద్యాశాఖమంత్రి రవీంద్రనాథ్ స్పందించారు. ఈ ఘటనపై తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. చికిత్సకు ఆలస్యం జరగడంపై.. కేరళ విద్యా శాఖ కూడా తమకు నివేదిక సమర్పించాలని సూచించింది. చిన్నారి మృతికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వయనాడ్ జిల్లా కలెక్టర్ అదీలా అబ్దుల్లా తెలిపారు.
ఇదీ చూడండి: కశ్మీర్ ఆంక్షల గుప్పెట్లో లేదు: సుప్రీంకు కేంద్రం వివరణ