'ప్రకృతి సోయగాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది' అని ఊహించి అందమైన చిత్రం గీసినట్లు కనిపిస్తున్నాయి.. హిమాలయ పర్వత ప్రాంతాలు. అంతటి మనోహర దృశ్యాల్ని చూసి ముగ్ధులవుతున్నారు పర్యటకులు. మంచువానలో తడుస్తూ.. భూలోక స్వర్గాన్ని ఆస్వాదిస్తున్నారు. మైనస్ డిగ్రీల చలికి వణికిపోతున్నా.. చలిమంటలు కాచుకుంటూ వెచ్చదనాన్ని పొందుతున్నారే కానీ, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలనిపించడం లేదంటున్నారు.
'నేను రాజస్థాన్ నుంచి వచ్చాను. ఇలా మంచు కురుస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మేము 3 రోజుల క్రితం బయల్దేరి చండీగఢ్ చేరుకున్నాము. అక్కడి నుంచి సిమ్లా చేరుకున్నాం. రాత్రి అద్భుతమైన మంచు వర్షం కురిసింది. ఉదయం చూసేసరికి ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. మాకైతే.. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ సమయంలో మంచు కురుస్తుందని మేము అసలు ఊహించలేదు.'
-పర్యటకుడు
మంచుమయం..
ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలోని సిమ్లా, డోడా, లాహుల్, నార్కండ, కులు, మనాలీ, కుఫ్రీ, కిన్నౌర్ సహా పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. కుఫ్రీలో రోడ్లు, భవనాలు, వాహనాలపై నాలుగు అంగుళాల వరకు మంచు పేరుకుపోయింది. ఇక్కడికి వస్తున్న సందర్శకులు వాటి పక్కన నిల్చుని సెల్ఫీలు దిగుతూ.. సామాజిక మాధ్యమాల్లో పంచుకుని మురిసిపోతున్నారు.
కిన్నౌర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఏకంగా 2 నుంచి 4 అడుగుల ఎత్తు మంచు పేరుకుపోయింది. విషయం తెలుకున్న వేలాదిమంది ప్రకృతి ప్రియులు ఆ అందాలను చూసి జ్ఞాపకాలను కూడబెట్టుకునేందుకు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ట్రెక్కింగ్, గుర్రపు స్వారీలు, స్కేటింగ్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
![snow fall in himalayas uttharakhand and himachalpradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5374570_sang-13.jpg)
'మేము చండీగఢ్ నుంచి వచ్చాము. నేను సౌరభ్, ఈమె నా భార్య ప్రియ. ప్రత్యేకించి మంచు చూసేందుకే ఈ ప్రాంతానికి వచ్చాం. మంచు కురుస్తుందని మేము ముందే ఊహించాం. అనుకున్నట్టే.. మా మార్గ మధ్యంలోనే మంచు కురవడం మొదలైంది.'
-పర్యటకుడు
రైతులకూ ఆనందం..
ఈ ప్రాంత రైతులూ హిమపాతంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
'ఈ సీజన్లో మొదటి మంచు వర్షంతో ఇక్కడి రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఎందుకంటే.. యాపిల్ చెట్లకు వచ్చే తెగుళ్లు ఈ చలి కారణంగా వాటంతట అవే నయం అవుతాయి. అందుకే ఈ సారి బంగాళదుంప, బఠాణీ వంటి పంటలు కూడా బాగా పండుతాయని ఆశిస్తున్నాం. ఈ మంచు వల్ల, ఎండాకాలంలో వర్షాలు కురుస్తాయి. అందుకే ఈ మంచు ఇలాగే కురవాలి, రైతులకు ఎలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటున్నా.'
-రైతు, కిన్నౌర్ జిల్లా
జర భద్రం
ఈ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధిక మంచు వల్ల రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువే. కాబట్టి, పర్వత ప్రాంతాల్లో తిరిగే పర్యటకులు, స్థానికులు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తోంది.
![snow fall in himalayas uttharakhand and himachalpradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5374570_sang-12.jpg)