భారత రాజ్యాంగ పరిషత్‌కు న్యాయ సలహాదారుగా బెనగళ్ నర్సింగరావు అందించిన సేవలు అనన్య సామాన్యం. బీఎన్ రావుగా సుప్రసిద్ధుడైన ఆయన భారత తొలితరం ఐసీఎస్ అధికారి. బ్రిటిష్ పాలనలో 1935లో వచ్చిన భారత ప్రభుత్వ చట్టం రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.
విజయవంతంగా నడుస్తున్న ప్రస్తుత సమాఖ్య వ్యవస్థను నర్సింగరావు అప్పుడే ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలకు స్థానం కల్పించారు. కేంద్ర, రాష్ట్రాల్లో ద్విసభలను, పబ్లిక్ సర్వీసు కమిషన్లను, వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టును, ఆర్థిక చర్యలను నియంత్రించడానికి రిజర్వు బ్యాంకును ప్రతిపాదించారు. 1935నాటి చట్టం ప్రకటించిన వెంటనే గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మదన్‌మోహన్ మాలవీయ వంటి హేమాహేమీలంతా తోసిపుచ్చారు.
అయితే భిన్న భౌగోళిక ప్రాంతాలు, మతాలు, సంస్కృతులు, వర్గాలున్న దేశానికి సమాఖ్య తరహా ప్రభుత్వం అవసరాన్ని గుర్తెరిగి 1946లో భారత రాజ్యాంగ పరిషత్‌కు న్యాయ సలహాదారు హోదాలో బీఎన్ రావు అందరినీ ఒప్పించగలిగారు. ముసాయిదా రూపకల్పనలో భాగంగా బీఎన్ రావు అమెరికా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్ దేశాల్లో పర్యటించారు. 1948 ఫిబ్రవరిలో రాజ్యాంగ తొలి ముసాయిదా ప్రతిని తయారుచేశారు.