మహా సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే: పవార్
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరడం ఖాయమైంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ మేరకు సుదీర్ఘ చర్చలు జరిపిన మూడు పార్టీల అగ్ర నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టతనిచ్చారు. శివసేన నేతృత్వంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉంటారని పవార్ ధ్రువీకరించారు.
ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపకాలపై ముంబయిలో 3 పార్టీల నేతలు భేటీ అయ్యారు. 3 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రిత్వ శాఖల పంపకాలపై చర్చించినట్లు సమాచారం. చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
ఈ మేరకు రేపు 3 పార్టీల నేతలు మీడియా ముందుకు వస్తారని శరద్ పవార్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అప్పుడే వెల్లడిస్తామన్నారు. గవర్నర్‌ను కలిసే అంశంపైనా రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు పవార్.
చర్చలు కొనసాగుతాయి..
భేటీ అనంతరం కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. శివసేనతో సానుకూలంగా చర్చలు జరిపామని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. అయితే చర్చలు ఇంకా పూర్తి కాలేదని.. రేపు కూడా కొనసాగుతాయన్నారు. ముఖ్యమంత్రి అంశమై.. పవార్ ప్రకటనపై స్పందించేందుకు చవాన్ నిరాకరించారు. పూర్తి స్థాయి చర్చలు జరిగాక ఈ విషయంపై మాట్లాడతామని పేర్కొన్నారు.