సాయిబాబా జన్మస్థలంగా పేర్కొంటున్న పాథ్రీ పట్టణాభివృద్ధికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించడం కొత్త వివాదానికి దారితీస్తోంది. మరాఠా సర్కారు నిర్ణయంపై శిరిడీ సహా చుట్టు పక్కల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి నిరసనగా రేపటి నుంచి నిరవధికంగా బంద్ పాటించాలని నిర్ణయించారు.
ఆలయాన్ని కూడా నిరవధికంగా మూసేస్తారనే వార్తలు జాతీయ మీడియాలో వెలువడ్డాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ స్పష్టం చేసింది. గ్రామస్థుల బంద్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని సంస్థాన్ ప్రకటించింది. గ్రామస్థులు ఇచ్చిన బంద్ పిలుపుపై వారితో చర్చించబోతున్నట్టు ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు.
సమస్య నిధులు కాదు
పాథ్రీ పట్టణ అభివృద్ధికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రూ.100 కోట్లు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. పాథ్రీ పట్టణ అభివృద్ధి వల్ల శిరిడీ ప్రాశస్త్యం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తమ ఆందోళన పాథ్రీ అభివృద్ధికి నిధులు కేటాయించడంపై కాదని సాయి జన్మస్థలాన్ని వివాదం చేయడంపైనేనని శిరిడీ వాసులు చెబుతున్నారు