వివాదాస్పద 2019 పౌరసత్వ చట్టసవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ సందర్భంగా.. దేశంలో నివసిస్తున్న మైనారిటీలకు ఈ బిల్లుతో ఏ ప్రమాదం లేదని.. వారు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత పౌరులుగానే ఉంటారని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బిల్లును తీసుకొచ్చారన్న ఆరోపణలను తోసిపుచ్చారు అమిత్ షా.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులను నిరోధించేందుకే ఈ బిల్లు తెచ్చినట్టు స్పష్టం చేశారు షా. విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు కాని మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని.. ముస్లింలకు పౌరసత్వం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
" దేశంలోని ముస్లింల గురించి ఎటువంటి చర్చగానీ, చింతగానీ అవసరం లేదు. వారు ఎప్పటికీ దేశ పౌరులే. భారత్లో ఉన్న ఏ ముస్లిం సోదరుడు చింతించొద్దని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఎవ్వరికీ భయపడద్దు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చే ముస్లింలకు భారత పౌరసత్వం ఇస్తామని అనడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ముస్లింలందరికీ భారత పౌరసత్వం ఇవ్వాలా? అలా ఎలా ఇస్తాం? దేశం ఎలా ముందుకెళ్తుంది?"
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
బిల్లుపై అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని విపక్షాలకు సూచించారు షా. ఎన్నికలకు ముందే బిల్లుపై హామీ ఇచ్చామని గుర్తుచేశారు.
షా ప్రసంగం అనంతరం ఈ బిల్లుపై విపక్షాలు తమ గళాన్ని వినిపించాయి.