మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. 'మహా వికాస్ అఘాడీ'కి శరద్ పవారే మార్గదర్శి అని అధికారిక పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో రాసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం ముందు సంకీర్ణ కూటమి, ఉద్ధవ్ ఠాక్రే మోకరిల్లరని స్పష్టం చేసింది.
"శరద్ పవార్ లాంటి బలమైన, అనుభవజ్ఞులైన మార్గదర్శి మాతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎవరికీ వ్యతిరేకంగా పనిచేయదు."
- సామ్నా సంపాదకీయం
కీలకపాత్ర
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై భాజపా, శివసేన మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి మహా వికాస్ అఘాడీ ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. హిందుత్వ భావజాలం ఉన్న శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఏర్పాటుచేయడంలో శరద్ పవార్ కీలకపాత్ర పోషించారు. ఇదే విషయాన్ని సామ్నా సంపాదకీయంలో పేర్కొంది సేన.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
"భాజపాకు మద్దతిచ్చిన అజిత్ పవార్‌తో ఈ మంగళవారం శరద్‌పవార్ చర్చలు జరిపారు. ఫలితంగా అజిత్.. ఫడణవీస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా ప్రభుత్వం కుప్పకూలింది. ఈ రాజకీయ నాటకరంగాన్ని అంతా తానై నడిపించిన శరద్‌పవార్... మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు" అని సంపాదకీయంలో పేర్కొంది శివసేన.
కొత్త సూర్యుడు ఉదయించాడు..
"మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా నిలిచిన భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో 'కొత్త సూర్యుడు ఉదయించాడు'" అని శివసేన వ్యాఖ్యానించింది. స్వాతంత్ర్యం వచ్చిన రోజున దేశప్రజలంతా ఎంత ఆనందపడ్డారో.. నేడు మహారాష్ట్ర ప్రజలు అంతే ఆనందంలో ఉన్నారని" సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
సంకీర్ణ ప్రభుత్వం మూడు కాళ్లతో ఎక్కువకాలం మనలేదని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన విమర్శలను ఒట్టి 'మాయ'గా అభివర్ణించింది శివసేన. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తుందని స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా దిద్దుబాటు చర్యలు