మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. తాజాగా భాజపా, శివసేన మధ్య ఈ రోజు జరగాల్సిన భేటీ రద్దయింది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలతో సమావేశాన్ని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రద్దు చేశారు.
"చెరిసగం అధికారంపై ఒప్పందమేమీ జరగలేదన్న ఫడణవీస్ వ్యాఖ్యలపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన భేటీని ఆయన రద్దు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్, మరో నేత భూపేంద్ర యాదవ్ రావాల్సి ఉంది."
-సంజయ్ రౌత్, శివసేన నేత
5 రోజులుగా ప్రతిష్టంభన
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలై 5 రోజులు అవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం వీడకపోగా.... మిత్రపక్షాల మధ్య మాటలయుద్ధం తీవ్రమైంది. చెరిసగం సీఎం పదవి కావాలంటూ పట్టుబట్టిన శివసేన.. భాజపాపై విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. అవసరమైతే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి వస్తుందంటూ పరోక్ష హెచ్చరికలు చేసింది.
"మేం భాజపాతో పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మాకు సంకీర్ణ కూటమిపై నమ్మకం ఉంది. కానీ మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి తప్పు చేసేందుకు భాజపా మమ్మల్ని ప్రేరేపించకూడదు. రాజకీయాల్లో ఎవరూ పునీతులు కారు."
-సంజయ్ రౌత్, శివసేన నేత
ఫడణవీస్ స్పందన
శివసేన చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు ఎట్టకేలకు మహా సీఎం దేవేంద్ర ఫడణవీస్ దీటుగా సమాధానమిచ్చారు. మరో ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. సీఎం పదవీ కాలం పంచుకోవడంపై శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తేల్చిచెప్పారు.
"శివసేనకు సీఎం పదవి ఇచ్చే అంశంపై అమిత్ షా ఎలాంటి హామీ ఇవ్వలేదు. మహాకూటమి ప్రభుత్వానికి భాజపానే స్థిరమైన, సమర్థమైన నాయకత్వం వహిస్తుంది. భాజపా తరఫు అభ్యర్థిని మోదీ ఎప్పుడో ప్రకటించారు. బుధవారం జరిగే శాసనసభా పక్షనేత ఎంపిక నామమాత్రమే."
-దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర సీఎం
సేన నుంచి భాజపాలోకి...!
పరిణామాలు వేగంగా మారుతున్న సమయంలో భాజపా ఎంపీ సంజయ్ కాకడే సంచలన వ్యాఖ్యలు చేశారు.
"శివసేనకు చెందిన 56 మంది ఎమ్మెల్యేల్లో 45 మంది మాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మాతో కలిసి వచ్చేందుకు ఫడణవీస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫడణవీస్ సీఎంగా ప్రభుత్వ ఏర్పాటుకు వారంతా సుముఖంగా ఉన్నారు. "
-సంజయ్ కాకడే, భాజపా ఎంపీ
భాజపా శాసనసభా పక్షనేత ఎంపిక కోసం బుధవారం విధాన్ భవన్లో భేటీ కానున్నారు ఆ పార్టీ కొత్త ఎమ్మెల్యేలు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు రెండు పార్టీల మధ్య భేటీ రద్దయిన నేపథ్యంలో భాజపా ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా నేనే: ఫడణవీస్