దేశంలో పెరుగుతున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. లైంగిక నేరాలకు సంబంధించి క్రిమినల్ న్యాయ వ్యవస్థను సమీక్షించాలని సుమోటోగా నిర్ణయించింది.
దీనిపై తమ స్పందన తెలపాలని అన్ని రాష్ట్రాలు, హైకోర్టులను ఆదేశించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. తమ తమ రాష్ట్రాల్లో కేసుల వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటితోపాటు లైంగిక నేరాల విచారణ, ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్-వైద్య ఆధారాలు, బాధితుల వాంగ్మూలం ఇతర అంశాలకు సంబంధించిన స్థితిపై 2020 ఫిబ్రవరి 7 లోపు నివేదిక ఇవ్వాలని సూచించింది.
2012లో జరిగిన నిర్భయ ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసిందని వ్యాఖ్యానించిన సుప్రీం.. ఇటీవలి కాలంలో నేరాలపై న్యాయపరంగా ఆలస్యం జరుగుతున్న కారణంగా ప్రజల్లో భయం, అశాంతి, ఆందోళన పెరిగిందని తెలిపింది.
అత్యాచార చట్టాలను సమగ్రంగా అమలు చేసేందుకు స్పష్టంగా స్థితిని అధ్యయనం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇందుకోసం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథరాను న్యాయ సలహాదారుగా నియమించింది.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!