ఆధార్ చట్టం 2019 లోని ప్రైవేటు సంస్థల క్లాజు రాజ్యాంగ బద్ధతపై జవాబివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. వ్యక్తిగత ధ్రువీకరణ కోసం వినియోగదారులు ప్రైవేటు సంస్థలకు స్వచ్ఛందంగా ఆధార్‌ను సమర్పించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌కు సమాధానమివ్వాలని ఆదేశించింది.
ఆధార్‌పై సుప్రీంకోర్టు గత తీర్పును ఉల్లంఘించేలా తాజా చట్ట సవరణ ఉందంటూ ఎస్జీ ఓంబత్కెరే అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బీఆర్ గవాయిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని... పెండింగ్‌లో ఉన్న ఆధార్ కేసుతో కలిపి విచారించాలని నిర్ణయించింది.
ఆధార్ ప్రామాణికమే: నాటి తీర్పు
ఆధార్ ప్రామాణికతను సమర్థిస్తూ గతంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే స్వచ్ఛందంగానైనా వినియోగదారుని వద్ద నుంచి ప్రైవేటు సంస్థలు ధ్రువీకరణ పత్రంగా ఆధార్‌ను తీసుకోకూడదని స్పష్టం చేసింది.
అయితే... బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు తీసుకునేందుకు ఆధార్‌ను ధ్రువీకరణగా సమర్పించవచ్చంటూ కేంద్రం ఇటీవలే చట్టాన్ని సవరించింది.
ఇదీ చూడండి: పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన