శబరిమలకు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను.. ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సమీక్ష పిటిషన్లతో పాటు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయన్న న్యాయస్థానం, మతంలో అంతర్గత భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని.. పిటిషనర్లు కోరినట్లు పేర్కొంది. ఒకేమతంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు వారికి నచ్చిన విధానాలు ఆచరించే స్వేచ్ఛ ఉందన్న కోర్టు.. మత విధానాలనేవి నైతికత, ప్రజా ఆదేశాలకు భిన్నంగా ఉండరాదని అభిప్రాయపడింది.
"మసీదుల్లోకి మహిళల ప్రవేశం అంశంపైనా చర్చ జరిగింది. కీలకమైన మత విధానాలను మతపెద్దలతో చర్చించాలా? అనే విషయం నిర్ధరించాలి. మత విశ్వాసాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అనే అంశాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలించాలి."
- తీర్పులో సుప్రీంకోర్టు
రెండు రోజుల్లో తెరుచుకోనున్న ఆలయం
మండల పూజ కోసం మరో రెండు రోజుల్లో ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న వేళ.. గత తీర్పుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాటి తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన 65 పిటిషన్లు పెండింగ్లో ఉంచింది.
3:2 మెజారిటీతో తీర్పు
పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న తీర్పును 3:2 మెజారిటీతో వెల్లడించింది కోర్టు. ఈ నిర్ణయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ జె ఖన్వీల్కర్, జస్టిస్ ఇందూమల్హోత్రాలు సమర్థించగా.. జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ వ్యతిరేకించారు.
సుప్రీంకోర్టు గత తీర్పులో ఏముంది?
కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్ యంగ్ లాయర్స్ అసోషియేషన్ తరఫున ఆరుగురు మహిళలు 2006లో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వాదించారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు- 2018, సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది. స్త్రీ పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది. మహిళల ప్రవేశానికి అనుమతించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లు అనుకూలంగా తీర్పిచ్చారు. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం వ్యతిరేకించారు.
సుప్రీంకోర్టు తీర్పుపై మొదట తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు... తర్వాత మెత్తబడ్డారు. సనాతన సంప్రదాయాలను గౌరవించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గట్టిగా వాదించిన, ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సైతం ఆ తర్వాత తీర్పును గౌరవిస్తామంటూ ప్రకటించింది. అయితే.... వేలమంది అయ్యప్ప భక్తులు మాత్రం మహిళల ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదంటూ కేరళతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.