దిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పరిహారం చెల్లించాలని ఎందుకు అడగకూడదని ప్రశ్నించింది. కాలుష్య నియంత్రణలో పంజాబ్, హరియాణా, యూపీ, దిల్లీ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల పట్ల న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్, హరియాణాలో పంటవ్యర్థాల కాల్చివేత ఘటనలు పెరుగుదలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చివాట్లు పెట్టింది. పంటవ్యర్థాల కాల్చివేతను నిషేధిస్తూ గతంలో ఉత్తర్వులు వెలువరించినప్పటికీ వ్యర్థాల దహనం పెరగడమేంటని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల కాల్చివేత నియంత్రణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఈ ఘటనలకు రాష్ట్రాలయంత్రాంగాలే కాకుండా రైతులు సైతం బాధ్యులేనని పేర్కొంది.
క్షీణిస్తున్న ఆయుష్షు
వాయు కాలుష్యం కారణంగా లక్షలాదిమంది ప్రజల ఆయుష్షు క్షీణిస్తోందంది సర్వోన్నత న్యాయస్థానం. దేశరాజధాని ప్రాంత ప్రజలను అది ఊపిరి ఆడకుండా చేస్తోందని చెప్పింది. వాయు కాలుష్యంతో ప్రజలు మరణించేందుకు మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించింది. ఈ తప్పు చాలా ఏళ్లుగా జరుగుతోందన్న ధర్మాసనం.. గ్యాస్ ఛాంబర్లలో బతకాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నిలదీసింది. పేలుడు పదార్థాలతో దిల్లీ వాసులను చంపేయడం అంతకంటే నయమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నివేదికలు కోరిన సుప్రీం..
వాయు,నీటి కాలుష్యంపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందలించింది సర్వోన్నత న్యాయస్థానం. నదులలో కాలుష్య స్థాయిలను తెలుసుకునేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలు సమర్పించాల్సిందిగా సంబంధిత రాష్ట్రాలను, కేంద్రకాలుష్య నియంత్రణ బోర్డును ఆదేశించింది. వాయు, నీటి నాణ్యత సహా వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నివేదికలను సమర్పించాల్సిందిగా అన్నిరాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. దిల్లీలో గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై 10రోజుల్లోగా నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి: ముంబయి గ్రాండ్ హయత్ హోటల్లో 'మహా రాజకీయాలు'