అవినీతి, తీవ్రవాదం కేసుల్లోని నేరస్థులకు ప్రత్యేక చట్టాల ద్వారా విధించిన వివిధ జైలు శిక్షలను వరుసగా అమలు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 4 వారాల తర్వాత వాదనలు వింటామని తెలిపింది.
న్యాయవాది, భాజపా నేత అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించేందుకు అంగీకరించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. అమెరికా వంటి దేశాల్లో దోషులకు ఏకకాలంలో కాకుండా వరుసగా శిక్షలు అమలు చేస్తున్నట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసిన కారణంగా పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ అభ్యర్థించారు.
సీఆర్పీసీని అమలు చేయకూడదు..
కోడ్ ఆఫ్ క్రిమిషన్ ప్రోసీజర్ (సీఆర్పీసీ) నియమాల ప్రకారం వివిధ నేరాల్లో నిందితులు ఒకేసారి శిక్ష అనుభవించేందుకు వీలు కల్పిస్తోంది. అది అతి ఘోరమైన నేరాలకు మాత్రమే మినహాయింపు ఇస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 31ను.. యూఏపీఏ, పీసీఏ, పీఎంఎల్ఏ, ఎఫ్సీఆర్ఏ, నల్లధనం-పన్నుల చట్టం, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లకు అమలు చేయకూడదని పిటిషనర్ కోరారు.
ఇదీ చూడండి: ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా దిద్దుబాటు చర్యలు