పౌర చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న అల్లర్లపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఈ ఆందోళనలపై సీబీఐ లేదా న్యాయస్థానం పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరిపించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం పేర్కొంది.
ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ కోరగా న్యాయస్థానం తోసిపుచ్చింది. అలా అని ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవడం లేదని స్పష్టంచేసింది.
ఎవరున్నారో తెలియాలి..?
పౌరచట్టానికి వ్యతిరేకంగా బంగాల్లో జరిగిన ఆందోళనలను ప్రస్తావించారు పిటిషనర్. రైళ్లకు నిప్పుపెట్టారని, దీని వెనుక ఎవరున్నారో సీబీఐ లేదా సిట్ దర్యాప్తు జరిపించాలని ఉపాధ్యాయ్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
దిల్లీ జామియా, అలీగఢ్‌లోని ముస్లిం విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, పోలీసుల చర్యలపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. అనంతరం.. ఉపాధ్యాయ పిటిషన్‌పై వాదనలు వినే అవకాశముంది.
ఇదీ చూడండి: బంగాల్లో 'పౌర' ఆందోళనలు తీవ్రం.. ఈశాన్యాన తగ్గుముఖం