మంత్రోచ్ఛరణలు, అయ్యప్ప నామస్మరణ మధ్య మండల-మకరవిలక్కు పూజ కోసం శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ తలుపులను తెరిచారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందారు మహేశ్ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి.. ఆలయంలో పూజలు నిర్వహించారు.
మహిళలను వెనక్కి పంపిన పోలీసులు..
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం పంబ నుంచి స్వాములు బయలుదేరారు. స్వామి దర్శనార్థం వెళ్లిన నిషేధిత వయస్సున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. అయ్యప్ప దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పది మంది మహిళల వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం వెనక్కి పంపారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 ఏళ్లలోపు వయస్సున్న మహిళలను ముందుకు పంపడం కుదరదని పోలీసులు స్పష్టం చేశారు.
భారీ భద్రతా ఏర్పాట్లు..
అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. పది వేల మంది పోలీసులను దశల వారీగా మోహరించారు. గతేడాదిలా ఈ సారి ఎలాంటి ఆంక్షలు విధించడంలేదని తెలిపారు.
శబరిమలలో ఈరోజు నుంచి డిసెంబర్ 27వరకు అయ్యప్ప స్వామికి నిత్యపూజలు జరుగుతాయి.
ఇదీ చూడండి: ఎన్డీఏ సమావేశానికి శివసేన దూరం!