ప్లాస్టిక్ వాడకాన్ని విజయవంతంగా నిషేధించగలిగితే జనపనార వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జనపనార పరిశ్రమకు పునరుత్తేజం తీసుకురావచ్చు. జనపనార రైతులు, వస్తు తయారీదారులు కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మూలనపడిన జనపనార రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జనపనారపై దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే జనపనార రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. "
-రతన్ బిస్వాస్, రైతు
సాధారణంగా మనం ప్రతి వస్తువును తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ అనుకూలంగా ఉంటుంది. దీని స్థానంలో జనపనార విజయవంతం అవుతుందా అనే సందేహాలు ఉన్నాయి.
బంగాల్లోని ఉత్తర 24 పరగణాల, నడియా జిల్లాలు జనపనార పంటకు ప్రఖ్యాతి. అయితే ఇక్కడి రైతుల సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర జనపనార కమిషనర్‌ను కేంద్రం పూర్తి నివేదిక కోరింది. ఈ నివేదికలో జనపనార అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలు, చట్ట సవరణలు, భారీ ఎత్తున ఉత్పత్తి సాధించేందుకు కావాల్సిన సదుపాయాలకు సంబంధించిన విషయాలు ఉండాలని ఆదేశించింది.
నడియాలోని జనపనార రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలపైనే ఆశలు పెట్టుకున్నారు. జనపనార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేస్తే అందుకు అనుకూలంగా పంట దిగుబడి కూడా పెరుగుతుందని రైతులు అంటున్నారు.
"జనపనార ఉత్పత్తుల వాడకం పెరిగితే రైతులు లాభపడుతారు. ప్లాస్టిక్ వాడకం వల్ల దేశానికి హాని కలుగుతుందనేది స్పష్టం. ప్రజలు భూమిలో కలిసిపోయే వస్తువులను ఉపయోగిస్తే దేశంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి."
-సుకుమార్ మండల్, రైతు
ప్లాస్టిక్ పరిశ్రమకు చెందిన చాలా మంది నిషేధాన్ని ఆలస్యంగా చేయాలని కేంద్రాన్ని బలవంతపెడుతున్నారు. నెమ్మదిగా అయినా ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిస్తే జనపనారకు డిమాండ్ పెరగటం ఖాయం. ఫలితంగా జనపనార పరిశ్రమ ప్రాణం పోసుకుంటుంది.
ఇదీ చదవండి: పల్లెలు తేరుకొంటేనే.. దేశ ప్రగతి!