ఆసియాన్‌లోని పది సభ్యదేశాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో చేతులు కలిపిన మరో ఆరు దేశాల మధ్య ఆధునిక, సమగ్ర, అత్యంత మెరుగైన పరస్పర లబ్ధిదాయక ఆర్థిక భాగస్వామ్య ఒడంబడికను సాధించడమే ధ్యేయంగా ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్) వేదిక ఏడేళ్ల క్రితం పురుడు పోసుకుంది. ఈ ఏడాది చివరిలోగా తుది ఒప్పందం ఖరారుకు సభ్యదేశాలు సంకల్పం ప్రకటించినా- ప్రవచిత మార్గదర్శక సూత్రాలకు, ఆర్‌సెప్ స్థాపిత స్ఫూర్తికి పూర్తిగా మన్నన దక్కలేదంటూ బ్యాంకాక్ వేదిక నుంచి భారత ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందం పరిధి నుంచి ఇండియా వైదొలగినట్లయింది.
భారత్ వినా తక్కిన పదిహేను దేశాలూ తలొగ్గిన ఒడంబడికపై వచ్చే ఏడాదికి సంతకాలు అవుతాయని ఆర్‌సెప్ సంయుక్త ప్రకటన చాటుతోంది. పరస్పర ప్రయోజనదాయకం కావాల్సిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు ధృతరాష్ట్ర కౌగిలిలా మారి కొన్ని దేశాల ప్రగతి కాంక్షల్ని ఎలా నుగ్గునూచ చేస్తాయో ఇండియాకు తెలియనిది కాదు. ఆ మాటకొస్తే ఆసియాన్ సహా మరో నాలుగు దేశాలతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల్ని ఇండియా ఇప్పటికే కుదుర్చుకొంది. వాటి తాలూకు ఆటుపోట్లతోనే సతమతమవుతున్న భారత్ పరిస్థితి- ఆర్‌సెప్ ముసుగునీడన చైనా తన చౌక ఉత్పత్తుల్ని నిరాఘాటంగా గుమ్మరించడం మొదలుపెడితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుంది. దేశీయంగా వర్తకులు, రైతులు, వృత్తి నిపుణులు, పలు పరిశ్రమల వర్గాలు, శ్రామికులు, వినియోగదారులు కొన్ని నెలలుగా మొత్తుకొంటున్నదీ అదే. భారతీయుల ప్రయోజనాల రీత్యా ఆర్‌సెప్ ఒప్పందాన్ని పరికిస్తే అది సక్రమంగా లేదన్న ప్రధాని మోదీ- నిస్సంకోచంగా దాన్ని తిరస్కరించడం శ్లాఘనీయమైనదే. అతిపెద్ద వాణిజ్య ఒడంబడిక చట్రం పరిధిలో ఇండియా లేకపోవడం పెట్టుబడులు, విపణి అవకాశాలకు తీవ్రాఘాతమవుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించినా, క్షేత్రస్థాయి స్థితిగతులే ప్రామాణికంగా సరైన సాహసోపేత నిర్ణయం తీసుకొన్నందుకు ప్రధాని మోదీని అభినందించాలి!
ఏడేళ్లుగా..
బ్యాంకాక్ తీర్మానం ద్వారా 1967లో ప్రాదుర్భవించిన ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) రెండేళ్లనాడు స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకొంది. 2005 నుంచి తూర్పు ఆసియా సదస్సుల ద్వారా ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను భాగస్వాములుగా పరిగణిస్తూ- మొత్తం 360 కోట్ల జనావళితో పరిపుష్టమైన బృహత్ స్వేచ్ఛా విపణి స్వప్న సాక్షాత్కారానికి ఏడేళ్లుగా కృషి చేస్తోంది. నిజానికి లోగడ అమెరికా ప్రతిపాదించిన పసిఫిక్ తీరప్రాంత దేశాల భాగస్వామ్య వాణిజ్య కూటమిలో తనకు చోటు లేకపోవడంతో దానికి ప్రతిగా చైనా ఆర్‌సెప్‌ను 2012లో ప్రతిపాదించింది. 2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక పసిఫిక్ వాణిజ్య కూటమికి మంగళం పాడటం తెలిసిందే. బీజింగుతో వాణిజ్య అసమతూకంపై కన్నెర్ర చేసిన ట్రంప్ కఠిన చర్యల కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో, చైనాకు ఆర్‌సెప్ అవసరం మరింతగా పెరిగింది.
ఐరోపా మాదిరిగా ఆసియాన్ ఆర్థిక సమాజ స్వప్నం సత్వరం సాకారం కావాలంటూ 2015లో కౌలాలంపూర్ వేదిక నుంచి ఆర్‌సెప్ చర్చల్లో ఉత్సాహాన్నీ ఉరవడినీ పెంచింది ప్రధాని మోదీయే. ఆసియాన్ సహా తక్కిన అయిదు దేశాలతో 2013-14లో 5,400 కోట్ల డాలర్లుగా ఉన్న ఇండియా వాణిజ్యలోటు 2018-19లో దాదాపు రెట్టింపు కావడం, అందులోనూ భీమభాగం బీజింగ్ వాటాయే ఉండటం- భారత్ దీర్ఘకాల ప్రయోజనాలకు భంగకరమే. 2010లో ఆసియాన్‌లోని ఆరు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పుడు చైనాతో ఆయా దేశాలకు గల వాణిజ్య మిగులు 5,300 కోట్ల డాలర్లు. అదికాస్తా 2016 నాటికి 5,400 కోట్ల డాలర్ల వాణిజ్య లోటుగా మారిపోవడాన్నిబట్టే డ్రాగన్ మార్కెట్ మాయాజాలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆర్‌సెప్ బాటలో- భారతావనిలో సహస్ర వృత్తుల శ్రమజీవుల పొట్టగొట్టేలా విదేశీ వాణిజ్య చొరబాట్లను ఏ మాత్రం ఉపేక్షించబోమన్నదే మోదీ నిర్ణయ సారాంశం!
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు..
రెండు దశాబ్దాలుగా ఇండియా- శ్రీలంక, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియాలతో పాటు ఎన్నో వాణిజ్య కూటములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటివల్ల ఇండియాకు ఒనగూడిన వాణిజ్య లబ్ధి పిసరంత కూడా లేదని రెండేళ్లనాడు నీతిఆయోగ్ నివేదికే నిష్ఠురసత్యం పలికింది. ఒప్పందం మేరకు పదిశాతం సుంకాలు తగ్గించినప్పుడల్లా ఒకటిన్నర శాతం మేర దిగుమతులు పెరిగి దేశీయంగా ఖనిజ పరిశ్రమ దారుణంగా దెబ్బతినిపోయింది. ఇప్పటికే ఆసియాన్ దేశాలు, శ్రీలంక నుంచి నల్ల మిరియాలు, యాలకులు; వియత్నాం, ఇండొనేసియాల నుంచి చౌక రబ్బరు, ఫిలిప్పీన్, ఇండొనేసియాల నుంచి కొబ్బరి చెక్క వంటివి విస్తృతంగా వచ్చిపడుతుండటంతో దేశీయ రైతు దిగాలు పడుతున్నాడు. ఆర్‌సెప్ అమలులోకి వస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి పోటెత్తే పాడి ఉత్పాదనల తాకిడి రైతాంగాన్ని నిలువునా ముంచేసే ప్రమాదం ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆర్‌సెప్‌లో ఆ రెండింటితోపాటు చైనా, జపాన్లకూ భాగస్వామ్యం ఉండటంతో పట్టు, ఉద్యాన, పూదోటల రైతాంగ ప్రయోజనాలూ దారుణంగా కొల్లబోతాయని, దొడ్డిదారిన చొరబడే చైనా ఉత్పత్తులతో చిన్న పరిశ్రమలు చితికిపోతాయన్న భయాందోళనల్ని తోసిపుచ్చే వీల్లేదు. కాబట్టే, ప్రగతిశీల భాగస్వామ్యం కోసం, ఉభయతారక వాణిజ్యం కోసం బ్యాంకాక్‌లో భారత్ తన గళాన్ని విస్పష్టంగా వినిపించింది. ఆర్‌సెప్‌ను అడ్డంపెట్టుకొని బీజింగ్ తమను కబళిస్తుందేమోనన్న ఆందోళన కొన్ని ఆసియాన్ దేశాల్లోనూ వ్యక్తమైంది. తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరమన్న మోదీ గ్రహింపు దేశాన్ని అంతిమంగా క్షేమంగా ఒడ్డునపడేసింది!
ఇదీ చూడండి: చైనా దూకుడుకు కళ్లెం వేసేలా కొత్త వ్యూహం