దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ... ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం- ఆర్సెప్లో భారత చేరదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలోని పేద, ఆర్థిక రంగాలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య రంగంలో అంతర్జాతీయ పోటీకి భారత్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంలోని ప్రధాన ప్రయోజనాలపై స్పష్టత లేదని మోదీ అభిప్రాయపడ్డారు.
బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆర్సెప్ సమావేశంలో భారత్ వైఖరిని కరాఖండిగా ప్రకటించారు మోదీ. ప్రపంచ వ్యాపార శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గే రోజులు పోయాయని.. ఈ ఒప్పందం వల్ల తమ దేశం ఎదుర్కొనే సమస్యలపై మోదీ తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. ఆర్సెప్ తరహాలో ఉండే ఎమ్ఎఫ్ఎన్(మోస్ట్ ఫేవర్డ్ నేషన్)లోనూ భారత్ చేరబోదని తేల్చిచెప్పారు ప్రధాని.
ప్రస్తుత ఒప్పందంలోని లోపాల్ని ఎత్తిచూపించారు భారత ప్రధాని. ప్రాంతీయ అంతర్గతకు భారత్ కట్టుబడి ఉంటుందని.. కానీ గత ఏడేళ్లుగా ఆర్సెప్లో జరిగిన మార్పుల వల్ల తమ దేశానికి విరుద్ధ ప్రయోజనాలు చేకూరే అవకాశముందని తన ప్రసంగంలో వెల్లడించారు మోదీ.
"అంతర్జాతీయ నిబంధానల ప్రకారం ప్రాంతీయ సమగ్రతతో పాటు స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్ కట్టుబడి ఉంటుంది. ఆర్సెప్ చర్చల్లో భారత్ ఎంతో నిర్ణయాత్మకంగా, అర్థవంతమైన విధంగా పాల్గొంది. కానీ గత ఏడేళ్లలో ఆర్సెప్ సంప్రదింపుల్లో అనేక మార్పులు జరిగాయి. వీటిని మనం విస్మరించలేం. ప్రస్తుత ఆర్సెప్ ఒప్పందం.. ప్రధాన ఆర్సెప్ స్ఫూర్థిని ప్రతిబింబించదు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఆర్సెప్ ఒప్పందంపై భారత్ సంతకం చేస్తే... దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని విపక్షాలు ఆరోపించాయి. ఒప్పందం వల్ల దేశంలోకి చైనా చౌక ధర సరుకులు వెల్లువెత్తుతాయని... దీని వల్ల దేశంలోని చిరు వ్యాపారులు, రైతులు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశాయి.
అయితే.. భారత్ ఆర్సెప్లో చేరాలనుకుంటే తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపింది ఆస్ట్రేలియా. మిగతా దేశాలు కూడా.. భారత్ లేవనెత్తిన అంశాలపై స్పందించాయి. అన్ని దేశాలు కలిసి ఈ అంశాలపై చర్చిస్తామని పలు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు.