పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది.సమాజంలో మహిళకు సమాన హక్కులు ఏమో గానీ స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా పొందలేకపోతోంది. తనను రక్షించుకునే పరిస్థితిలో లేని మహిళ మృగాళ్ల కింద నలిగిపోయి నిస్సహాయంగా మిగులుతోంది. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో అధిక శాతం అత్యాచారాలకు సంబంధించినవే ఉంటున్నాయి.
గణాంకాలు
మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఇవే 59.3 శాతం ఉండగా.. వరకట్నపు చావులు, హత్యలు రెండో స్థానంలో ఉన్నాయి. భారత శిక్షాస్మృతి కింద 2017లో దేశం మొత్తం 1,21,997 మందికి శిక్షపడితే అందులో మహిళలపై నేరాలకు పాల్పడినవారు 18,165 మంది ఉన్నారని జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఇందులో అత్యాచార కేసుల్లో శిక్ష పడినవారు 10,892 మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరకట్నం చావుల నేరాల కింద 5,448 మంది శిక్ష అనుభవిస్తున్నారు.
వరకట్నం, అత్యాచారం, దౌర్జన్యం, భర్త, బంధువుల వేధింపులు ఎక్కువే. వీటి కింద ఆంధ్రప్రదేశ్‌లో 268 మందికి, తెలంగాణలో 164 మందికి శిక్ష పడగా, మహిళలపై ఇతర నేరాలకుగాను ఏపీలో 221, తెలంగాణలో 42 మంది శిక్ష పడింది. ఐపీసీ కింద విచారణ ఖైదీలుగా దేశవ్యాప్తంగా 2.43 లక్షల మంది ఉన్నారు. ఇందులో 2558 మందికాగా మహిళలపై నేరాలకు పాల్పడినవారు ఏపీలో 482 మంది, తెలంగాణలో 357 మంది ఉండటం గమనార్హం. వరకట్న నిషేధం తదితరాలకు సంబంధించి రాష్ట్రాలు తీసుకొచ్చిన స్థానిక చట్టాల కింద దేశవ్యాప్తంగా 583 మందికి శిక్ష పడగా.. తెలంగాణలో 84 మందికి, ఏపీలో 20 మందికి శిక్ష పడింది.
ఇదీ చడండి : 'మహిళల్లో విశ్వాసం పెంచేలా పోలీసు సేవలుండాలి'