భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రపంచ స్థాయి సదస్సు 'రైజీనా డైలాగ్' నేడు ప్రారంభం కానుంది. దిల్లీలో జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో 7 దేశాల మాజీ అధినేతలు కూడా పాల్గొననున్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబ్సర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఈ సదస్సులో భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపై చర్చ జరుగుతుంది.
ప్రముఖుల హాజరు
దేశ రాజధానిలో జరుగుతున్న అయిదో రైజీనా సదస్సుకు 100 దేశాలకు చెందిన 700 మంది పాల్గొననున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 12 దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. వీరిలో ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరిఫ్ హాజరవటం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది.
వీరితో పాటు షాంఘై సహకార సంస్థ ప్రధాన కార్యదర్శి, కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పలు దేశాలకు చెందిన భద్రతా సలహాదార్లు, సహాయ మంత్రులు ఈ సదస్సుకు రానున్నారు.
ఈ సదస్సులో మొత్తం 80 సెషన్స్‌లో వివిధ అంశాలపై చర్చిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సంయుక్త కార్యాచరణ, ప్రపంచ వాణిజ్య నిర్మాణం, మిషన్-2030 తదితర అంశాలు చర్చకు రానున్నాయి.
ఇదీ చూడండి:'సీఏఏ, ఎన్పీఆర్ను తక్షణమే ఉపసంహరించండి'