'రఫేల్'పై దాఖలైన సమీక్ష పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వంపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్... దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
"రఫేల్‌పై సమీక్ష పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం.. నిరాధారమైన, తప్పుడు ప్రచారాలపై ఆధారపడే నాయకులకు, పార్టీలకు తగిన గుణపాఠం." - అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి
రఫేల్ ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి, కుంభకోణాలకు పాల్పడలేదని.. ఇదే విషయాన్ని సుప్రీం తీర్పు స్పష్టం చేసిందని అమిత్‌షా పేర్కొన్నారు. రఫేల్ అంశంపై కాంగ్రెస్ విలువైన పార్లమెంట్ సమయాన్ని వృథా చేసిందని ఆరోపించారు.
'రఫేల్'పై దర్యాప్తు జరగాల్సిందే: రాహుల్
రఫేల్ ఒప్పందంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందే అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎమ్ జోషి 'రఫేల్'పై దర్యాప్తునకు పూర్తిస్థాయిలో అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు.
రఫేల్ ఒప్పందంలో జరిగిన అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు చేపట్టాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
భాజపాకు క్లీన్చిట్
ఫ్రాన్స్‌కు చెందిన డసో సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ కేసు సమీక్ష పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా మోదీ సర్కారుకు ఊరట లభించింది.
ఇదీ చూడండి: శబరిమలపై సుప్రీం నిర్ణయానికి 'కేరళ స్వాగతం'