'అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ గెలవడం కష్టమైన ఈ రోజుల్లో మహారాష్ట్ర, హరియాణాలో భాజపా విజయం సాధించడం ఆనందకరమన్నారు' ప్రధాని నరేంద్ర మోదీ. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవిస్, హరియాణాలో మనోహార్‌లాల్ ఖట్టర్... భాజపాను గెలిపించారని అన్నారు. ప్రజల ఆదరణ, నమ్మకం వల్లే ఇది సాధ్యమైందన్న మోదీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
మంత్రులుగా ఏమాత్రం అనుభవం లేకుండానే ముఖ్యమంత్రులుగా పదవి చేపట్టిన దేవేంద్ర ఫడణవిస్, మనోహర్‌లాల్ ఖట్టర్ నాయకత్వాన్ని అభినందించారు. వారు 5 ఏళ్లు పూర్తిగా ప్రభుత్వాన్ని నడపటం వల్లే ఆయా రాష్ట్రాల్లో భాజపాకు విజయం దక్కిందని ప్రధాని అన్నారు.
"మహారాష్ట్ర, హరియాణాల్లో ముఖ్యమంత్రులుగా దేవేంద్ర ఫడణవీస్, మనోహర్‌లాల్ ఖట్టర్‌కు అనుభవం లేదు. ఈ ఇద్దరు గతంలో మంత్రులుగా కూడా పనిచేయలేదు. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో సంపూర్ణ విజయం దక్కలేదు. హరియాణాలో కూడా కేవలం రెండు సీట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. అయినప్పటికీ... అందర్నీ కలుపుకొని.. ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి బృందం... మహారాష్ట్ర, హరియాణా ప్రజలకు ఐదేళ్లు సేవ చేశారు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి