పౌరసత్వ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు చెలరేగాయి. దిల్లీ పార్లమెంటు ప్రాంగణం, అసోం, త్రిపుర, బంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పలు పార్టీలు, సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి.
పార్లమెంటు సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఎంపీలు ధర్నా చేపట్టారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) సభ్యులు.. దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు.
''మేం ఈ బిల్లుకు వ్యతిరేకం. ఇది రాజ్యాంగానికి, హిందూ-ముస్లింల ఐక్యతకు పూర్తి విరుద్ధం.''
- బద్రుద్దిన్ అజ్మల్, ఏఐయూడీఎఫ్ ఎంపీ- ధుబ్రి, అసోం
దిల్లీతో సహా.. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురలోనూ పలు పార్టీలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. బిల్లును నిరసిస్తూ వివిధ సంఘాల పిలుపు మేరకు.. గువహటిలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు.
ఇవాళ లోక్సభలో ప్రవేశం...
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు.. పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుపై లోక్సభలో మాటల యుద్ధం