ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్లో పౌరసత్వ చట్ట సవరణపై ఆందోళనలు శనివారమూ కొనసాగాయి. నాగాలాండ్‌లో నిరసనకారులు ఆరుగంటల పాటు బంద్ చేపట్టారు. అసోం సోనిత్‌పుర్ జిల్లా దెకియాజులిలో ముగ్గురు గుర్తుతెలియని ఆందోళనకారులు చమురు ట్యాంకుకు నిప్పంటించారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. బంగాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అనేక చోట్ల ఆందోళనలు నిర్వహించారు.
బంగాల్లో హింసాత్మకం
వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా బంగాల్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హావ్‌డా జిల్లాలోని సంక్రియాల్ స్టేషన్‌కు నిరసనకారులు నిప్పంటించారు. భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. హావ్‌డా, సెల్డా స్టేషన్ల మీదగా నడవాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. 'పౌర' చట్టానికి వ్యతిరేకంగా వందలమంది రహదారులను దిగ్బంధించారు. ఫలితంగా వాహన రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.
ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
అసోంలో విద్యార్థుల నేతృత్వంలో
అసోం విదార్థి సమాఖ్య(ఆసు), అసోం జాతీయతావాది యువఛత్ర పరిషత్ సహా మరో 30 సంస్థల నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజూ సాయంత్రం 5 గంటలవరకు నిరసనలు చేపడతామని ఆసు విద్యార్థి నేతలు వెల్లడించారు.
హింసాయుత నిరసనల దృష్ట్యా అసోంలో డిసెంబర్ 16 వరకు అంతర్జాల సేవలు నిలిపి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.
నాగాలాండ్‌లో ఆరుగంటల పాటు..
నాగాలాండ్ రాష్ట్రంలో ఆరుగంటల పాటు బంద్ పాటించారు. విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి.
ఆంక్షలు సడలింపు
'పౌర'వ్యతిరేక ఆందోళనలకు ప్రధానకేంద్రంగా మారిన అసోం గువాహటి సహా దిబ్రూగఢ్‌లలో కొన్ని గంటలపాటు నిరవధిక కర్ఫ్యూ నిబంధనలను సడలించారు. మేఘాలయ రాష్ట్రంలోనూ ఆంక్షల నిబంధనలను కొద్ది గంటలపాటు ఎత్తేశారు.
బిహార్‌లో 21న బంద్
బిహార్‌లో డిసెంబర్ 21న పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తామని లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ ప్రకటించింది.
'ఈశాన్యానికి వెళ్తే జాగ్రత్త'
ఈశాన్య భారతంలోని పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్, కెనడా, సింగపుర్ సహా వివిధ దేశాల ప్రభుత్వాలు వారి పౌరులను హెచ్చరించాయి. ఆయా ప్రాంతాల్లో పర్యటించే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించాయి.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి సోదరుడు కిడ్నాప్- డిమాండ్లు ఇవే...