గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సిఫార్సుల మేరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ఆమోదముద్ర వేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని గవర్నర్... కేంద్రానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రస్తుతం అసాధ్యమని, వేరే ప్రత్యామ్నాయం లేకే రాష్ట్రపతి పాలనవైపు మొగ్గు చూపినట్లు తన నివేదికలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. గవర్నర్ సిఫార్సుకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ ప్రతిపాదన, గవర్నర్ నివేదిక రాష్ట్రపతి భవన్‌కు చేరాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి 19వ రోజైన మంగళవారం శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. .
'ప్రత్యామ్నాయం లేకే'
నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 15 రోజుల పాటు ప్రయత్నాలు జరిగాయని.. గవర్నర్ వద్ద మరో ప్రత్యామ్నాయం లేకే గవర్నర్ పాలనకు సిఫార్సు చేశారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కేంద్రమంత్రివర్గ సూచన మేరకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని తెలిపింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మంగళవారం సాయంత్రానికల్లా మద్దతు లేఖలను ఇవ్వడం కష్టమవుతుందని గవర్నర్‌కు తెలిపిన కారణంగానే కోశ్యారీ కేంద్రానికి నివేదిక పంపారని పేర్కొంది.
'స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి..'
రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో.. మంగళవారం సాయంత్రం భాజపా కోర్ కమిటీ సమావేశమైంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించింది. అయితే.. రాష్ట్రపతి పాలనకు శివసేన మొండివైఖరే కారణమని ఆరోపించారు భాజపా నేత సుధీర్ ముంగంటీవార్. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ మండిపాటు...
గవర్నర్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. రాజ్యాంగ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. సేన తొలిసారిగా సోమవారమే తమను సంప్రదించిందని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్. మద్దతు విషయంలో మరిన్ని అంశాలపై స్పష్టత కోసం శివసేనతో చర్చలు జరగాల్సి ఉందని వెల్లడించారు. గవర్నర్ నిర్ణయాన్ని ఖండించారు మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్. గవర్నర్ ఎవరి ఒత్తిడితోనే పనిచేస్తున్నట్లు ఆరోపించారు.
'సిద్ధాంతాలు వేరైనా'
సిద్ధాంతాలు వేరైనప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి పనిచేస్తామని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంపై మూడు పార్టీల మధ్య ఓ అవగాహన అవసరమే అని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటువిషయంలో.. కాంగ్రెస్, ఎన్సీపీలతో తాము మొదటిసారిగా నవంబర్ 11న చర్చలు జరిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ హిందుత్వ నినాదానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్-ఎన్సీపీ.. అదే వైఖరి
అయితే శివసేనకు మద్దతిచ్చే అంశమై సోమవారం ఆలస్యం చేసిన .. కాంగ్రెస్, ఎన్సీపీలు మంగళవారం అదే వైఖరి అవలంబించాయి. సేనతో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించాయి. దిల్లీ నుంచి మహారాష్ట్రకు చేరుకున్న సీనియర్ కాంగ్రెస్ నేతలతో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామని శరద్‌పవార్ వెల్లడించారు.
వ్యూహాత్మకంగా భాజపా..
మహా ప్రతిష్టంభన మొత్తం వ్యవహారంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది భాజపా. ఆరంభం నుంచి శివసేనకు సీఎం పదవికి ఇచ్చేందుకు విముఖత చూపింది. ఫలితాలు వెలువడిన అక్టోబర్ 24 నుంచి పూర్వ అసెంబ్లీ గడువు ముగిసే వరకూ మౌనం వహించింది కమల దళం. చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని వెల్లడించింది. తమకు దక్కని అధికార పీఠాన్ని ఎవరికీ అందకుండా చేసే ఉద్దేశంతోనే భాజపా పావులు కదిపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏ సమయంలోనైనా ఎత్తేసే అవకాశం...
శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచిన నేపథ్యంలో పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకు వస్తే రాష్ట్రపతి పాలనను ఎత్తేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భాజపా, సేనల మధ్య సయోధ్య కుదిరినా.. కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి గవర్నర్‌కు లేఖలు అందిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందని విశ్లేషిస్తున్నారు.
వ్యూహాల్లో పార్టీలు..
కాంగ్రెస్, ఎన్సీపీలపై విశ్వాసంతో.. భాజపాతో మైత్రిని వీడిన శివసేనకు తాజా రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిస్తున్నాయని తెలుస్తోంది. తమ అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్, ఎన్సీపీలు తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నాయని సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సుముఖంగానే ఉన్నా.. శరద్‌పవార్ డిమాండ్లతో సరైన సమయంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఈసీ అశోక్ లవాసా కుమారుడిపై కేసు నమోదు