ప్రస్తుతం ఎక్కడ చూసినా హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలో కమలదళం మళ్లీ పాలనా పగ్గాలు చేపడుతుందన్న సర్వేలు తారుమారయ్యాయి. అలా అని విపక్ష కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. అనూహ్యంగా 'జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)' తెరపైకి వచ్చింది. ఆ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా.. కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎన్నో ఆసక్తికర పరిణామాలతో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది 'హరియాణా'.
ఉచానా కలన్ నుంచి చౌతాలా గెలుపు
నిన్నమొన్నటి వరకూ దుష్యంత్ చౌతాలా ఎవరనేది దేశ ప్రజల్లో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఆయన హరియాణాలో చక్రం తిప్పే స్థితిలో కనిపిస్తున్నారు. అన్నీ కలిసివస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో...!
ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో హిసార్‌లోని జింద్ జిల్లా ఉచానా కలన్ నియోజకవర్గం నుంచి విజయకేతనం ఎగురవేశారు దుష్యంత్. కేంద్ర మాజీమంత్రి చౌదరి బీరేందర్ సింగ్ భార్య, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రేమ్లతపై దుష్యంత్ గెలుపొందారు.
కింగ్‌మేకర్ 'దుష్యంత్'
మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణాలో ప్రధాన పార్టీలైన భాజపా,కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాలేదు. హస్తం పార్టీతో పోలిస్తే.. కమలదళం కాస్త ముందంజలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జననాయక్ జనతా పార్టీ లేదా ఇతరుల మద్దతు తప్పనిసరిగా కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్-జేజేపీ చేతులు కలిపినప్పటికీ... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 46 స్థానాలు వచ్చేలా కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రధానపార్టీలు అధికారం కోసం జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలాకు ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం ఆఫర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హరియాణాలో ఇంతటి రసవత్తర రాజకీయాలకు కారకులైన దుష్యంత్ చౌతాలా ఎవరు? ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు మొదలైంది.. ప్రస్తుతం కింగ్ మేకర్‌గా నిలవగలిగే స్థాయికి ఎలా వచ్చారు. అసలు జేజేపీ పార్టీ ఎలా పుట్టుందో చూద్దాం.
దేవీలాల్ కుటుంబం నుంచి...
మాజీ ఉప ప్రధాని, హరియాణా మాజీ ముఖ్యమంత్రి 'దేవీలాల్' ముని మనుమడు దుష్యంత్. ఐఎన్‌ఎల్‌డీ అగ్రనేత ఓం ప్రకాశ్ చౌతాలాకు మనుమడు. 26 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేశారు దుష్యంత్. దేవీలాల్ కుటుంబం నుంచి అతిపిన్న వయసులోనే ఎన్నికల బరిలోకి దిగిన నేతగా గుర్తింపు పొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీ తరఫున ఘన విజయం సాధించారు. హిసార్ లోక్‌సభ ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు.
పార్టీ నుంచి బహిష్కరణ
దేవీలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్‌డీ)లో ఆధిపత్యం కోసం ఆయన ఇద్దరు మనుమళ్లు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాల మధ్య తీవ్రస్థాయిలో పోరు నడిచింది. 2018లో అధికార కలహాలు తారస్థాయికి చేరినందున అజయ్‌తో పాటు ఆయన కుమారులు దుష్యంత్, దిగ్విజయ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు ఓం ప్రకాశ్ చౌతాలా. ఫలితంగా 2018 డిసెంబర్ 9న 'జననాయక్ జనతాపార్టీ (జేజేపీ)'ని స్థాపించారు దుష్యంత్. ఆయన ముత్తాత చౌదరి దేవీలాల్‌ను ప్రజలు జననాయక్ అని పిలిచేవారు. అందుకే ఆయన పేరుతోనే పార్టీని స్థాపించారు దుష్యంత్.
జాట్ల ప్రాబల్యం..
హరియాణాలో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. చౌతాలా కుటుంబంతో పాటు కాంగ్రెస్‌నేత భూపిందర్‌సింగ్ హుడా అదే వర్గానికి చెందినవారు. 2014 ఎన్నికల్లో జాటేతర సీఎంగా మనోహర్ ఖట్టర్ పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో జాట్లు మళ్లీ ఏకమై దుష్యంత్‌కు మద్దతు ఇచ్చినందున జేజేపీ కీలకంగా మారింది.