సుప్రీంకోర్టులో శబరిమలపై దాఖలైన సమీక్ష పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడాన్ని కేరళలోని పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు స్వాగతించారు. భక్తుల నమ్మకాన్ని రక్షించేందుకు ఈ తీర్పు సహకరిస్తుందని కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రకటించారు. శనివారం నుంచి అయ్యప్ప ఆలయంలో మొదలు కానున్న మండల పూజ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగుస్త్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు గత తీర్పులో ఏదో లోపం ఉందని భావించినందువల్లే సమీక్ష పిటిషన్లను ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి బదిలీ చేసిందని సీనియర్ భాజపా నేత కుమ్మనమ్ రాజశేఖరన్ అన్నారు. సుప్రీం నిర్ణయం పట్ల ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు పలువురు ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభత్వ ప్రతినిధులెవ్వరూ ఇంకా స్పందించలేదు.
"సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈ తీర్పు భక్తుల నమ్మకాన్ని మరింత దృఢం చేస్తుంది."
- కందరారు రాజీవారు, శబరిమల ప్రధాన అర్చకులు
" రివ్యూ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న సుప్రీం తీర్పుతో సంతోషంగా ఉన్నా."
- శశికుమార్ వర్మ, పండాళం రాజకుటుంబీకులు
మహిళలను అనుమతించకూడదు
" గతేడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని.. మహిళలను పటిష్ఠ భద్రత నడుమ ఆలయంలోకి తీసుకెళ్లేందుకు విజయన్ ప్రభుత్వం ప్రయత్నించకూడదు. 10 నుంచి 50 ఏళ్లలోపు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యప్ప సన్నిధిలోకి తీసుకురాకూడదు."
- రమేశ్ చెన్నితల, కేరళ ప్రతిపక్షనేత
శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాటి తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన దాదాపు 65 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీటిని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయించింది.
" పవిత్ర ప్రదేశాల్లో మహిళల నిషేధమనేది శబరిమలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. దేశంలోని ఇతర దేవస్థానాలు, మసీదులు తదితర వాటికి సంబంధించినది."
- సుప్రీంకోర్టు వ్యాఖ్య