మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి పి.చిదంబరం విమర్శించారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై మోదీ అసాధారణరీతిలో మౌనంగా ఉన్నారని, తన మంత్రులను మాత్రం బెదిరింపులు దిగమని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్పై విడుదలయ్యాక మొదటిసారి దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు చిదంబరం.
ఆర్థిక మందగమనం సమస్యకు ప్రభుత్వం వద్ద ఎలాంటి పరిష్కారం లేదని చిదంబరం విమర్శించారు. నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జీఎస్టీ విధానం, పన్ను ఉగ్రవాదాన్ని సమర్థించుకోవడానికి భాజపా సర్కార్ మొండిగా ప్రవర్తిస్తోందని నిప్పులు చెరిగారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో.. 106 రోజులపాటు కారాగారంలో ఉన్న ఆయన బుధవారం బయిల్పై విడుదలయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఏం చేశానో అందరికీ తెలుసునని.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రజలకు భాజపా ఎన్నో హామీలు ఇచ్చిందని... నేడు కనీసం వాటి గురించి పట్టించుకోవడం లేదని చిదంబరం విమర్శించారు. ఉల్లిధరలు ఇంతలా పెరిగినా మోదీ సర్కార్కు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మీడియా సహా అన్ని వ్యవస్థలు భయాందోళనలో ఉన్నాయని చిదంబరం అన్నారు.
ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలికి నిప్పు అంటించిన రాక్షసులు