కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రతి పని బంగాల్ అభివృద్ధి, ఇక్కడి నిరుపేదల సంక్షేమాన్ని ఉద్దేశించినవేనన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాము అమలు చేసే పథకాల ఫలాలను మమతా బెనర్జీ సర్కార్ ఇక్కడి లబ్ధిదారులకు చేరవేయడం లేదని ఆరోపించారు. కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌కు శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
సముద్ర తీరాలు దేశ అభివృద్ధికి ద్వారాల లాంటివన్నారు మోదీ. ప్రధానంగా ఉత్తర భారతదేశానికి భూటాన్, మయన్మార్, నేపాల్‌తో వాణిజ్యాన్ని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ బలపరుస్తుందన్నారు. ఇతర దేశాలతో వాణిజ్య బంధాన్ని మెరుగుపర్చేందుకే కేంద్రం 'సాగర్మల' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
"బంగాల్ రాష్ట్రం అభివృద్ధితోపాటు ఇక్కడి పేదల సంక్షేమానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాలకు బంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఇక్కడి ప్రజలు వాటి ప్రయోజనాలు పొందుతారు. "
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మోదీకి 'పౌర' సెగ...
పౌరసత్వ చట్టం, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, వామపక్ష, ఇతర పార్టీలు, వాటి అనుబంధ విద్యార్థి సంఘాలు ఆదివారం కోల్‌కతాలో సీఏఏతో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అంతకుముందు మోదీ శనివారం బంగాల్ చేరుకున్నప్పుడు 'మోదీ గో బ్యాక్, డౌన్ భాజపా' అంటూ నినాదాలు చేశారు. రాత్రి వరకు నాయకులు, కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు.