వాజ్‌పేయీ 95వ జయంతిని పురస్కరించుకుని మరో పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రధాని నరేంద్రమోదీ. భూగర్భ నీటి నిర్వహణ కోసం 'అటల్ భూజల్ యోజన'ను దిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా ప్రకటించారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
వాజ్‌పేయీ గౌరవార్థం రోహ్తంగ్ సొరంగాన్ని ఆయనకు అంకితమిచ్చారు ప్రధాని.
"నీటి విషయంలో అటల్జీ ప్రేరణ నాపై ఉంది. అటల్ భూజల్ యోజన, జల్‌జీవన్ మిషన్ ద్వారా 2024 వరకు ప్రతి ఇంటికీ నీటిని అందిస్తాం.
మరో అతిపెద్ద ప్రాజెక్టును అటల్జీకి అంకితమిస్తున్నాం. హిమాచల్‌ప్రదేశ్ నుంచి లద్ధాఖ్, మనాలీ నుంచి లేహ్‌ను కలిపే రోహ్తంగ్ సొరంగానికి అటల్ టన్నెల్‌గా నామకరణం చేస్తున్నాం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
అవసరం మేరకే...
ఈ సందర్భంగా నీరు వృథా కాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించిన మోదీ.. తక్కువ నీటితో పండే పంటలను వేయాల్సిందిగా రైతులకు సూచించారు. ఇళ్లలో అవసరాల మేరకే నీటిని వినియోగించాలన్నారు. నీటి వృథాను నియంత్రించేందుకు నూతన సాంకేతికతతో అంకుర పరిశ్రమలు ముందుకు రావాలని సూచించారు.
గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భూగర్భ జల సంరక్షణ కోసం కేంద్రం ఈ పథకం తీసుకువచ్చింది. దీని ద్వారా 78 జిల్లాల్లోని 8,350 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది.