ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంతా కాదు. పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే ప్లాస్టిక్‌తో దీర్ఘకాలిక అనారోగ్యాలు దరి చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో.. హరియాణాకు చెందిన ఓ యువబృందం ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను వదిలేసే దిశగా చక్కటి సందేశమిచ్చింది. 87, 297 వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లతో ఓ పెద్ద తాబేలును తయారు చేసింది. ఈ ప్లాస్టిక్ తాబేలు 6.6 అడుగుల ఎత్తు, 23 అడుగుల పొడవు ఉంది.
కురుక్షేత్రకు చెందిన రీతూ అనే విద్యార్థిని నలందా అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన మరో 100 మందితో కలిసి ఈ తాబేలును రూపొందించింది. వాతావరణ మార్పులు, పర్యావరణం అనే అంశాలపై రీతూ ఓ ప్రాజెక్టును రూపొందిస్తోంది. రీతూ తండ్రి క్యాన్సర్‌తో మృతి చెందారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌కు కారణమయ్యే అంశాలపై రీతూ ప్రజలకు అవగాహన కల్పించి వాటిని నియంత్రించేందుకు నిర్ణయించుకుంది.
"క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ కూడా ఓ కారకం. దురదృష్టం.. మా నాన్న క్యాన్సర్‌తో మృతి చెందారు. ఈ అంశమే నేను దీన్ని రూపొందించేందుకు స్ఫూర్తిని ఇచ్చింది. గిన్నిస్ రికార్డు సాధించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ద్వారా.. ఓ ఉదాహరణగా నిలవొచ్చు. భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉంది. ఈ కారణంగా మేం అంతర్జాతీయంగా సందేశమివ్వాలనుకున్నాం. ఇందుకోసం మేం ప్లాస్టిక్ తాబేలును తయారుచేశాం."
-రీతూ, విద్యార్థిని
ప్లాస్టిక్ కవర్లు, పల్చని ప్లాస్టిక్‌తో ఈ విద్యార్థి బృందం తాబేలును తయారుచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాడి పారేసిన ప్లాస్టిక్‌తో తయారుచేసిన అతిపెద్ద ప్రతిమ తమదేనని విద్యార్థులు చెప్పారు. ప్రపంచ రికార్డు కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.
ఇంతకుముందు 2012లో సింగపూర్‌లో వాడిపారేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఆక్టోపస్ బొమ్మ రికార్డుగా ఉంది. ప్రస్తుతం కురుక్షేత్ర విద్యార్థులు తయారుచేసిన తాబేలు ఆ రికార్డును వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ప్రపంచంలోనే తొలి 'చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్'