పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. పిట్‌బుల్ జాతికి చెందిన ఓ శునకం.. 15ఏళ్ల లక్ష్ ఉప్పల్ అనే బాలుడిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లాడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ బాలుడిపై శునకం దాడి చేసిన తీరు స్థానికులను విస్మయపరిచింది.
ఎంత ప్రయత్నించినా...
ట్యూషన్ ముగించుకొని సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న సమయంలో లక్ష్ ఉప్పల్‌కు పిట్‌బుల్ అడ్డుపడింది. భయాందోళనకు గురైన అతడు.. అక్కడి నుంచి కదలలేకపోయాడు. ఈ సమయంలో ఆ కుక్క ఉప్పల్ పిక్కను దాని పళ్లతో నోట కరిచి గట్టిగా పట్టుకుంది. నొప్పితో ఉప్పల్ విలవిల్లాడటం చూసి స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు.
పిట్‌బుల్ దృష్టి మరల్చేందుకు కొందరు దానిపై నీళ్లు పోశారు. ఇంకొందరు దాని శరీరంపై కర్రలతో బలంగా కొట్టారు. కానీ కుక్క బెదరలేదు. ఎంత ప్రయత్నించినా ఆ శునకం మాత్రం అతడి పిక్కను వదలలేదు. చివరకు 15 నిమిషాల తర్వాత ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ భయంకరమైన దాడిలో ఉప్పల్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చూడండి: ఆ జంట పెళ్లికి గోమాతే ముఖ్య అతిథి