కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు దిల్లీ వేదికగా సమావేశమయ్యాయి. పౌరచట్టం, జాతీయ జనాభా పట్టికను వెనక్కి తీసుకోవాలని తీర్మానించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న విపక్షాలు పేద ప్రజలు, మైనారిటీలకు ఇబ్బందకరమని వ్యాఖ్యానించాయి.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో సమావేశమైన 20 విపక్ష పార్టీలు పౌరచట్టం వ్యతిరేకంగా నిరసనలు, వర్సిటీల్లో హింస పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే మాయవతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.
"పౌరచట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ) అన్ని కలిపి రాజ్యాంగ విరుద్ధమైన ఓ ప్యాకేజీ. ఇది పేద ప్రజలు, అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, భాష, మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఎన్పీఆర్, ఎన్ఆర్సీకి మూలం. పౌరచట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం."
-విపక్ష పార్టీల తీర్మానం
ఎన్ఆర్సీని అమలు చెయ్యబోమన్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల.. ఎన్పీఆర్నూ తప్పనిసరిగా తిరస్కరించాలని కోరాయి విపక్షాలు.
'తీర్మానంతో పాక్‌కు సంతోషం'
పౌరచట్టం, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా విపక్షాల తీర్మానంపై భాజపా స్పందించింది. విపక్షాల తీర్మానం కచ్చితంగా పాకిస్థాన్‌ను సంతోషపెట్టి ఉంటుందని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. పౌరచట్టంతో మైనారిటీలపై పాక్ చేసే దురాగాతాలు బయటకు వచ్చే అవకాశం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
పౌరచట్టం అంశమై విపక్షాలు అనవసరంగా మోదీ ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు రవిశంకర్. పలు విపక్ష పార్టీలు హాజరు కాకపోవడం పట్ల వ్యంగ్యాస్త్రాలు సందించారు. విపక్షాల ఐక్యత నేడు బయటపడిందని వ్యాఖ్యానించారు. వారి తీర్మానానికి జాతీయ, భద్రతాపరమైన ఆసక్తులేమి లేవని అభిప్రాయపడ్డారు. హింసను ఎదుర్కోలేక పొరుగుదేశాల్లోకి పారిపోయిన మైనారిటీల పక్షంగా కూడా తీర్మానం లేదన్నారు.
ఇదీ చూడండి: 'మోదీజీ... వారితో మాట్లాడే ధైర్యం ఉందా?'