పీఓకేను నియంత్రిస్తున్న ఉగ్రవాదులు కశ్మీర్లో సాధారణ స్ధితి ఏర్పడకుండా ప్రయత్నిస్తున్నారని సైన్యాధిపతి బిపిన్ రావత్ ఆరోపించారు. యాపిల్ వర్తకులను, రవాణా కోసం వచ్చిన బయటి రాష్ట్రాల వారిని హత్య చేస్తున్నారని.. కొద్దిగా ఆలస్యమైనా మన సైనికులు ఈ సమస్యను పరిష్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తొలి సైనికాధిపతి కె.ఎం.కరిపయప్ప స్మారకార్థం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు రావత్. ఈ సందర్భంగా సియాచిన్ గ్లేసియర్ మీద స్టాంప్‌ను విడుదల చేశారు.
జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దును సమర్థించారు రావత్. ఆర్టికల్ 370 రద్దుతో క్రమక్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాలతో జమ్ముకశ్మీర్ కలిసిపోతుందన్నారు.
"పీఓకే, గిల్గిత్ బాల్టిస్థాన్ కలిపితేనే జమ్ము కశ్మీర్. ఈ ప్రాంతాన్ని మన పశ్చిమ పొరుగుదేశం అక్రమంగా ఆక్రమించింది. ఆర్టికల్ 370ని తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొచ్చినప్పుడు.. పాక్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటివరకు రెండు సార్లు ఈ ఆర్టికల్‌కు సవరణలు చేశారు. కానీ ఇప్పుడెందుకు హఠాత్తుగా 370పై మాట్లాడుతోంది పాక్. ఎందుకంటే.. అక్రమంగా ఆక్రమించిన ఈ ప్రాంతాన్ని పాక్ ప్రభుత్వం పాలించట్లేదు. ఈ ప్రాంతమంతా ఉగ్రవాదుల నియంత్రణలో ఉంది. పీఓకే ఓ ఉగ్రవాదులు పాలిస్తున్న ప్రాంతం."
-బిపిన్ రావత్, భారత సైన్యాధిపతి
ఇదే వేదికగా ఆయుధాల కొనుగోలుకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించారు బిపిన్ రావత్. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సిగ్ సేవర్ రైఫిళ్లు అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా సిగ్ సేవర్ రైఫిళ్లు సైనికుల అమ్ముల పొదిలో చేరుతాయని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి:- కోటీశ్వరులతో నిండిన హరియాణా శాసనసభ!