భారత్‌పై తన తీరును దాయాది పాకిస్థాన్ ఎంతమాత్రం మార్చుకోవడం లేదని ఆరోపించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్. 2019లో జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంబడి మొత్తం 3479 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు రాజ్యసభ వేదికగా సమాధానమిచ్చారు. ఇరు దేశాల సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన 13 మంది, సరిహద్దు రక్షణ దళానికి చెందిన ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు వెల్లడించారు.
"భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించిన ఉగ్రవాదులను మన సైనికులు మట్టుబెట్టారు. భారత సైనికులు సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతున్నట్టు చిత్రికరించేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్, ఇతర ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటున్న ఉగ్రవాదులను అంతర్జాతీయ మీడియా గుర్తించకుండా ఉండేందుకే కాల్పులు జరుపుతోంది. పాక్ కాల్పులకు... భారత సైన్యం, సరిహద్దు భద్రత దళాలు దీటైన సమాధానం ఇస్తున్నారు."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి.
అధికారుల స్థాయిలో చర్చలు..
పాకిస్థాన్ కాల్పులకు పాల్పడినప్పుడల్లా హాట్లైన్ల ద్వారా భారత అధికారులు పాక్ భద్రతాధికారులతో చర్చిస్తున్నట్లు.. ఇరుదేశాల సైనిక కార్యకలాపాల అధికారులు(డీజీఎంఓ) వారానికొకసారి భేటీ అవుతున్నట్లు వెల్లడించారు రాజ్‌నాథ్. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కూడా పాకిస్థాన్ అధికారులతో కాల్పుల విరమణ ఉల్లంఘనలపై చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు.
అక్టోబర్‌లో ఎక్కువ..
జమ్ముకశ్మీర్ సరిహద్దు వద్ద జనవరిలో 216 సార్లు, ఫిబ్రవరిలో 251, మార్చిలో 275, అక్టోబర్‌లో 398, నవంబర్‌లో 333, డిసెంబర్లో 393 సార్లు.. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. 2019 ఏడాది మొత్తంలో ఒక్క జూన్ నెలలో మాత్రమే అతి తక్కువగా 190సార్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.
సిమ్లా ఒప్పందం, లాహోర్ తీర్మానం ప్రకారం నియంత్రణ రేఖ, కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ ప్రాధాన్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పొరుగు దేశానికి ఉందని పాక్ అధికారగణానికి భారత్ పలుసార్లు గుర్తు చేస్తోందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 'సరిహద్దులు మూసేస్తేనే కరోనా త్వరిత వ్యాప్తి