పౌరసత్వ చట్ట సవరణపై గత కొంతకాలంగా భాజపాపై విమర్శల దాడికి దిగిన శివసేన తాజాగా... సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లింలను దేశం నుంచి తరిమికొట్టాల్సిందేనంటూ తమ అధికారిక పత్రిక సామ్నా కథనంలో పేర్కొంది. శివసేన మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే సీఏఏలో లోపాలున్నాయంటూ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించింది.
ఎంఎన్‌ఎస్ పార్టే లక్ష్యంగా...
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్)నూ విమర్శించింది శివసేన. ఇటీవల ఎంఎన్‌ఎస్ తమ జెండా రంగును పూర్తి కాషాయంలోకి మార్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘పాక్, బంగ్లా నుంచి వచ్చిన ముస్లింలను దేశం నుంచి తరిమికొట్టాల్సిందే. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే అలా చేయాలంటే మీ జెండా రంగును మార్చుకోవాల్సి ఉంటుందని ఎంఎన్‌ఎస్‌ను విమర్శించింది. శివసేన ఎప్పుడూ తమ జెండా రంగును మార్చుకోలేదు. హిందుత్వ సిద్ధాంతాల కోసం ఈ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంద’ని పేర్కొంది.
14ఏళ్ల క్రితం రాజ్‌ఠాక్రే మరాఠీ సిద్ధాంతాలతో ఎంఎన్‌ఎస్ పార్టీని స్థాపించారు. కానీ ఇప్పుడు హిందుత్వ సిద్ధాంతాల వైపు మారారు. కొన్ని వారాల క్రితమే రాజ్‌ఠాక్రే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు కేవలం ఓట్ల కోసం రంగులు మారుస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం భాజపా చేస్తున్న ప్రయత్నాలివి. సీఏఏ వల్ల కేవలం ముస్లింలే కాదు, హిందువులు కూడా ఇబ్బందులు పడే అవకాశముంది. ఈ చట్టంలో చాలా లోపాలున్నాయని శివసేన తమ కథనంలో చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి: 'రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కొరవడింది'