కళ్లు కాస్త మసకబారితేనే ఎటు నడుస్తున్నామో తెలీక, ఎదురుగా ఎవరుంటే వారిని ఢీకొంటాం. మరి అంధుల పరిస్థితి ఏంటి? అంధత్వంతో నిత్యం వారుపడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఇక దానకి తోడు వినికిడి సమస్య ఉంటే ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో కూడా తెలుసుకోలేక ఆపసోపాలు పడుతారు. అందుకే, ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నాడు ఓ బాల శాస్త్రవేత్త. సెన్సార్ కళ్లజోడును తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.
మనసు పెట్టి ఆలోచించాడు...
ఒడిశా జాజ్పుర్కు చెందిన ప్రియబ్రత సాహూ చదివేది ఎనిమిదో తరగతే అయినా.. శాస్త్రీయకోణం ఎక్కువే. స్థానిక ప్రహల్లాద్ చంద్ర బ్రహ్మచారీ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. పాఠశాలల్లో నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అటల్ తింకరింగ్ ల్యాబ్స్‌లో ఎక్కువ సమయం గడిపేవాడు. తన ఆలోచనలను ఎప్పటికప్పడు ఉపాధ్యాయులతో పంచుకునేవాడు. సాహూ మేధస్సుకు వారి ప్రోత్సాహం తోడైంది, ఇంకేముంది అద్భుతం ఆవిష్కృతమైంది.
వ్యర్థాలతో అద్భుతం...
వ్యర్థ పదార్థాలనే తన ముడి పదార్థాలుగా మలచుకున్నాడు సాహూ. సాధారణ కళ్లజోళ్లకు ప్రత్యేకంగా సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఎదురుగా ఉండే వస్తువులను గ్రహించి ఓ అలారం మోగేలా సాంకేతికతను జోడించాడు. అంధత్వంతో పాటు వినికిడి లోపమూ ఉన్న వారికోసం తయారు చేసిన కళ్లజోడులో వైబ్రేటింగ్ సిస్టమ్‌ను జత చేశాడు. ప్రమాదం తమ దరికి చేరుతుందనగా జాగృత పరచి, తమని తాము కాపాడుకునేందుకు దోహదపడుతున్నాయి ఈ కళ్లజోళ్లు.
'ఈ అద్దాలు తయారు చేయడానికి నాకు 15 రోజుల సమయం పట్టింది. అంధత్వం,వినికిడి లోపం ఉన్నవారి కళ్లజోడులో అల్ట్రా సోనిక్ సెన్సార్, అర్డ్యూనో నానో, వైబ్రేటర్ మోటర్లను అమర్చాను. మరో కళ్లజోడులో వాటితో పాటు ఓ బజర్‌ను ఏర్పాటు చేశాను. ఇది కేవలం దృష్టి లోపం ఉన్నవారి కోసం. '
-ప్రియబ్రత సాహూ
ఇంత పిన్న వయసులో గొప్ప ఆలోచన చేసిన సాహూ అందరి చేత సాహో అనిపించుకుంటున్నాడు. అంతే కాదు తన తోటి స్నేహితులకూ ప్రేరణనిస్తున్నాడు. పరిశోధనకు ప్రభుత్వ సహకారం అందితే మరెన్నో ప్రజాపయోజన ప్రయోగాలు చేస్తాడని ప్రియబ్రత తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:2013 తర్వాత తొలిసారి నిర్మానుష్యంగా కేదార్ ధామ్