తన వ్యక్తిగత భద్రత కంటే ఉత్తర్‌ప్రదేశ్‌లోని సామాన్య ప్రజల భద్రతే ముఖ్యమన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. లఖ్‌నవూ పర్యటన సందర్భంగా శనివారం జరిగిన ఘటనల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 4 రోజుల పర్యటన ముగించుకుని నేడు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. యోగి సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీ ప్రభుత్వం, పోలీసులు చట్టబద్ధం కాని చర్యలకు పాల్పడటం వల్ల రాష్ట్రంలో పాలన అరాచకంగా ఉందని దుయ్యబట్టారు. పౌరచట్ట వ్యతిరేక నిరసనల్లో హింసకు పాల్పడ్డవారిపై 'ప్రతీకారం' తీర్చుకుంటామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు ప్రియాంక.
"కాషాయం హిందుత్వానికి, ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. హిందూ మతానికి చిహ్నం. ఆ మతంలో హింసకు, ప్రతీకారానికి తావు లేదు."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
యూపీలో శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వారిపై పోలీసులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రియాంక. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించారని విమర్శించారు. పౌరసత్వ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఉద్ఘాటించారు.