'పౌర' నిరసనలతో దేశం అట్టుడుకుతున్న వేళ.. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ముంబయిలోని ఇండియా కాంక్లేవ్ సదస్సు వేదికగా పౌరసత్వ చట్ట సవరణ మైనారిటీలకు వ్యతిరేకం కాదని హోంమంత్రి పునరుద్ఘాటించారు.
'పౌరసత్వ చట్టం అమలు విషయంలో వెనక్కి తగ్గేది లేదు. చట్టం అమలుపై ప్రభుత్వం దృఢంగా ఉంది.'-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
న్యాయ సమీక్షలో సైతం తాజా చట్టం నిలబడుతుందని కేంద్ర హోంమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తాను సావర్కర్ కాదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాహుల్ ఎన్నటికీ వీర్ సావర్కర్లా మారలేరని ఎద్దేవా చేశారు. దానికి ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు షా. నిరసనల్లో విధ్వంసానికి పాల్పడినవారిపై మాత్రం చర్యలు కచ్చితంగా తీసుకున్నట్లు స్పష్టం చేశారు.