దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతుండటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిపాలన, పోలీసు యంత్రాంగాల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దాడులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. దేశ ప్రతిష్ఠకు కళంకం తెస్తున్న అత్యాచార ఘటనలకు సత్వరం అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. లైంగిక దాడి కేసుల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో తమకు తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం తాఖీదులు జారీ చేసింది. యువ పశు వైద్యురాలు దిశ హత్యాచారోదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
మన దేశంలో లైంగిక దాడి కేసులు పెరుగుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాఖీదులు పంపింది. ఆయా రాష్ట్రాల్లో ‘నిర్భయ నిధి’ స్థితిగతులపై 6 వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ‘నిర్భయ నిధి’ సొమ్మును తగ్గించారని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధిని సరిగా వినియోగించడం లేదని మీడియా కథనాల ద్వారా తమకు తెలిసిందని పేర్కొంది. నిర్భయ నిధి సహా మహిళల కోసం తీసుకొచ్చిన పలు పథకాల అమలు తీరును తెలియజేయాలంటూ కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శికి కూడా ఆదేశాలు జారీ చేసింది.
డీజీపీలకూ తాఖీదులు
మహిళలపై లైంగిక దాడి, అకృత్యాల వ్యవహారాల్లో ఎలాంటి ‘ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్‌వోపీ)’ అనుసరిస్తున్నారో 6 వారాల్లోగా తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. స్త్రీలకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తీసుకున్న చర్యల వివరాలనూ సమర్పించాలని తాఖీదుల్లో పేర్కొంది.
‘లేచిపోయి ఉంటుందిలే’ అంటారు!
బాలికగానీ, స్త్రీగానీ కనిపించడం లేదంటూ సహాయం కోసం ఎవరైనా పోలీసు స్టేషన్‌కు వెళ్తే.. ‘ఆమె ఎవరితోనో లేచిపోయి ఉంటుందిలే’ అని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తరచుగా ఆరోపణలొస్తున్నాయని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. అలాంటి అవమానకర ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. దేశ ప్రతిష్ఠను మసకబారుస్తున్న లైంగిక దాడి ఘటనలకు సత్వరం ముగింపు పలకాల్సిన అవసరముందని చెప్పింది. పాలన యంత్రాంగం, దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లనే ఎక్కువగా లైంగిక హింస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కమిషన్ పేర్కొంది. దురదృష్టవశాత్తూ అత్యాచారాలు, లింగ వివక్ష వంటివి ప్రసార మాధ్యమాలకు సాధారణ పతాక శీర్షికలుగా మారిపోయాయని వ్యాఖ్యానించింది. మహిళలు వివక్షకు, వేధింపులకు గురికాకుండా చూసేందుకు రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ నిబంధనలైతే ఉన్నా వారి జీవన హక్కు, స్వేచ్ఛ, హుందాతనం, సమానత్వాల పరంగా దేశవ్యాప్తంగా పరిస్థితులు దిగజారిపోతున్నాయంది.
ఈ ఘటన జరిగేది కాదేమో
హైదరాబాద్‌లో 26 ఏళ్ల పశువైద్యురాలి ఘోర ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ‘‘పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే అసలు ఈ సంఘటనే జరిగి ఉండేది కాదేమో’’ అని వ్యాఖ్యానించింది. ఝార్ఖండ్‌లోనూ పాతికేళ్ల న్యాయశాస్త్ర విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తుచేసింది. అమలుకు నోచుకోకుండా కేవలం పథకాలు ప్రకటించి, చట్టాలు రూపొందించి, నిధులు కేటాయించినంత మాత్రాన ఉపయోగం ఉండదంది. పోలీసులకు ప్రత్యేక శిక్షణనిచ్చి, మహిళల పట్ల వారి వైఖరి మారేలా చూడకపోతే పరిస్థితిలో మార్పు రాదంది.
ఇదీ చూడండి: నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ-ప్రగ్యాకు నో ఎంట్రీ