స్థానికులకే అత్యధిక ఉద్యోగాలు ఇవ్వాలనే వాదం దేశమంతటా తలెత్తడం ఏమాత్రం శుభ పరిణామం కాదు. ఉపాధి అవకాశాల్లో 80 శాతాన్ని స్థానికులకే కేటాయించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేనని ఘోషించింది. ఈ నిబంధనను రాష్ట్రంలోని పరిశ్రమలు మూడేళ్లలో అమలు చేయాలని, అర్హులైన సిబ్బంది దొరక్కపోతే పరిశ్రమలే స్థానికులకు తగు నైపుణ్యాలను నేర్పాలని సదరు బిల్లు నిర్దేశిస్తోంది. మధ్యప్రదేశ్ కూడా ఇలాంటి చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. కర్ణాటక, గోవా, ఒడిశాలూ అదే బాటలో ఉన్నాయి. దీనివల్ల పరిశ్రమలు ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి చేపట్టడానికి ముందుకురాకపోవచ్చు. ఫలితంగా అభివృద్ధి కుంటువడి ఉన్న ఉద్యోగాలకు ఎసరువచ్చి, కొత్త ఉద్యోగాలు పుట్టకపోయే ప్రమాదం ఉంది. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి విడిపోవాలని భీష్మించిన బ్రిటన్‌లో ఇప్పుడు జరుగుతున్నది అదే. భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉద్యోగార్థులకు తలుపులు మూసేస్తే, వెనకబడిన రాష్ట్రాలు పురోగమించే ఆశ ఉండదు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలూ దీర్ఘకాలంలో నష్టపోయి, చివరకు దేశ ఆర్థిక గతి దెబ్బతింటుంది. భారతదేశంలోని 10 కోట్ల కార్మికులు, ఉద్యోగుల్లో 20 శాతం వలస వచ్చినవారే. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు నిర్మాణ రంగంలో, విద్యావంతులు ఐటీ పరిశ్రమలో పనిచేయడం చూస్తూనే ఉన్నాం.
విఫల యత్నాలు
మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని 80 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయిస్తూ 2008లోనే బిల్లు తెచ్చినా, స్థానికులకు తగు నైపుణ్యాలు లేకపోవడంతో అది సక్రమంగా అమలు కాలేదు. కర్ణాటక ఏకంగా 100 శాతం ఉద్యోగాలు స్థానికులకేనంటూ 2016లో ఒక బిల్లు ప్రతిపాదించింది. అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రతిపాదనను వెనక్కుతీసుకుంది. మహారాష్ట్ర, అసోమ్‌లలో వలస కార్మికులకు వ్యతిరేకంగా మొదటి నుంచీ ఉద్యమాలు నడుస్తూ వచ్చాయి. ఇటీవలి కాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణాదికి కార్మికుల వలసలు పెరుగుతున్నందువల్ల ఇక్కడా నిరసన గళాలు తెరచుకుంటున్నాయి. కన్నడిగులకు నైపుణ్యాలను అలవరచి ఐటీ రంగ ఉద్యోగాల్లో వారికి సింహభాగం దక్కేట్లు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఉద్ఘాటించారు.
భావోద్వేగాలతో నిర్ణయాలు
నిజానికి స్థానికతకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్రాలు వాస్తవాల మీద కాక అపోహలు, భావోద్వేగాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 2000 సంవత్సరం తరవాత వలసలు పెరిగినా, వలస కార్మికులు స్వరాష్ట్రంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లారు తప్ప, ఇతర రాష్ట్రాలకు వెళ్లింది తక్కువని 2011 జనగణనను బట్టి తేలింది. అదలాఉంచితే పర రాష్ట్రాలవారు ఉద్యోగాల కోసం తమ రాష్ట్రానికి రాకూడదని నిషేధించే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. అలా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధం. గతంలో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల కూలీలు ఉపాధి కోసం ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి పశ్చిమ తీర రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు విద్యాఉపాధుల కోసం దక్షిణ రాష్ట్రాలకు వచ్చే ఉత్తరాదివారి సంఖ్య బాగా పెరిగింది. కానీ, ఇప్పటికీ అత్యధిక జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల సంఖ్య 10 శాతం లోపే. స్థానికులకే ఉద్యోగాలంటూ నినదిస్తున్న మధ్యప్రదేశ్‌లోనైతే ఇతర రాష్ట్ర వలస సిబ్బంది సంఖ్య అయిదు శాతం మాత్రమే. కార్మికుల వలసలపై 2011 గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ గణాంకాలు ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగలను ఉత్తరాది బృందంగా; కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను దక్షిణాది బృందంగా పరిగణిస్తున్నాయి. 2011 నుంచి 85 శాతం వలసలు దక్షిణ రాష్ట్రాలకే జరిగాయి. 2021 జనగణన ఈ వలసలు మరింత పెరిగాయని నిర్ధారించబోతున్నది. 2001-11 మధ్యకాలంలో ఆర్థిక కారణాల రీత్యా సొంత రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు, ఇతర సిబ్బంది సంఖ్య 1.3 కోట్లకు చేరింది. అంతకుముందు వీరి సంఖ్య 1.16 కోట్లు మాత్రమే. పట్టణాల్లో పనిచేసేవారిలో వలస కార్మికుల సంఖ్య ఎనిమిది శాతంగా ఉంది. 2017-18లో జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) జరిపిన అధ్యయనం ప్రకారం దేశంలో నిరుద్యోగిత 6.1 శాతం. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక నిరుద్యోగిత ఇది. 2017-18లో 11 రాష్ట్రాల్లో నిరుద్యోగం జాతీయ సగటు నిరుద్యోగిత కన్నా ఎక్కువగా ఉందని తేలింది. 2011-16లో దాదాపు 90 లక్షలమంది పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని 2017 ఆర్థిక సర్వే తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ల నుంచి అత్యధిక కార్మికులు దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లకు వలస వెళ్లారు. 1991-2001లో ఒకే రాష్ట్రంలోని జిల్లాల మధ్య వలసలు 30 శాతం. 2001-11 మధ్యకాలంలో అవి 58 శాతానికి పెరిగాయి. దేశంలో అత్యధికంగా 93.91 శాతం అక్షరాస్యత కలిగిన కేరళలోనే అత్యధిక నిరుద్యోగిత (11.4 శాతం) నమోదు కావడం గమనార్హం. పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉద్యోగావకాశాలు లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వలసలు పెరగడానికీ కారణమిదే.
చట్టాలతో పనికాదు
స్థానికులకే ఉద్యోగాలంటూ చట్టాలు చేసినంత మాత్రాన పని జరగదు. చట్టమంటే మంత్రదండం కాదు. కొత్త పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరిస్తేనే ఉపాధి అవకాశాలు పెరిగేది. సబ్సిడీలు, స్థానికులకు ఉద్యోగ కోటాల వల్ల దీర్ఘకాలంలో ఉపయోగం ఉండదు. నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, వ్యాపార సౌలభ్యం ఉన్న రాష్ట్రాలు సహజంగానే పరిశ్రమలను, వ్యాపారాలను ఆకర్షిస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా స్థానికులకే ఉద్యోగాలంటూ చట్టాలు చేసేస్తే సరిపోదు. వాటిని అమలు చేయడం తేలిక కాదు కూడా. అందుకే ఆంధ్రప్రదేశ్ చట్టంలో స్థానికత నియమం నుంచి ఎరువుల కర్మాగారాలకు, బొగ్గు గనులు, ఫార్మా కంపెనీలు, పెట్రోలియం, సిమెంటు కంపెనీలకు మినహాయింపు ఇచ్చారు. మున్ముందు ఐటీ కంపెనీలకూ మినహాయింపు ఇవ్వొచ్చు. దిల్లీ, చండీగఢ్, దమన్‌లలో మొత్తం కార్మికుల్లో 40 శాతం వలస వచ్చినవారే. ముంబయిలో 24 శాతం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు ఉపాధి నిమిత్తం వలస వచ్చినవారి సంఖ్య 15 శాతంలోపే. దేశంలోని 640 జిల్లాలకు 410 జిల్లాల్లో వలస కార్మికుల సంఖ్య అయిదు శాతం లోపే. వీటిలో దక్షిణాది జిల్లాలే ఎక్కువ. చివరకు పట్టణాల్లోని పనివారు, నిపుణుల్లో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారి సంఖ్య 10 శాతం లోపే, ఇది మున్ముందు మహా అయితే 20 శాతానికి చేరవచ్చు. ఈ నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగాలంటూ హడావుడి చేసేకన్నా తగు సామాజిక భద్రతతో సానుకూల వాతావరణంలో వలసలు జరగడానికి ఏర్పాట్లు చేయాలి.
రాజ్యాంగ విరుద్ధం
రాజ్యాంగంలోని 19వ అధికరణ భారత పౌరులు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు, స్థిరపడవచ్చని పేర్కొంటోంది. జన్మస్థలాన్ని బట్టి దుర్విచక్షణ చూపరాదని 15వ అధికరణ, జన్మించిన ప్రాంతాన్ని బట్టి ఉద్యోగ కల్పనలో దుర్విచక్షణ చూపకూడదని 16వ అధికరణ నిర్దేశిస్తున్నాయి. ఎక్కడ జన్మించినా భారత పౌరులంతా చట్టం ముందు సమానులేనని 14వ అధికరణ ఉద్ఘాటిస్తోంది. 2014లో చారు ఖురానా వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో తీర్పు ఈ మూడు అధికరణల ఆధారంగా వెలువడింది. చారు ఖురానా ఒక సౌందర్య (మేకప్) నిపుణురాలు. మహారాష్ట్రలో కనీసం అయిదేళ్లపాటు నివసించలేదు కాబట్టి ఆమెకు తమ సంఘంలో సభ్యత్వం ఇచ్చేది లేదని సినిమా కార్మికుల సంఘం తేల్చిచెప్పింది. అది రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. స్థానికులకు ఉద్యోగాల కేటాయింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే బిల్లులు రాజ్యాంగం ముందు నిలబడవు.
నష్టదాయకం
అంతర్రాష్ట్ర వలసలు తక్కువేనని, వాటికి రాజ్యాంగ భరోసా ఉందనే సంగతి ఆంధ్రప్రదేశ్ గమనించకపోవడం చిత్రంగా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్‌కు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారికన్నా, ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లేవారే చాలా ఎక్కువ. ఒకవేళ తెలంగాణ కూడా స్థానికులకే ఉద్యోగాలంటూ బిల్లు తెస్తే అందరికన్నా ఎక్కువ నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో వలసలు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, పరిసర గ్రామాల నుంచి పట్టణాలకూ జరుగుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు అత్యధికంగా హైదరాబాద్‌కే జరుగుతున్నాయి. ఈ వాస్తవాన్ని విస్మరిస్తే రాష్ట్రానికే నష్టం. ప్రస్తుత ఆర్థిక మందగమనంలో స్థానికతకు పెద్దపీట వేయడం యావత్ దేశానికి తీరని నష్టం. ఈ సంగతిని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు తప్పక గుర్తించాలి. ఉదాహరణకు దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో నిర్మాణ కూలీల్లో మధ్యప్రదేశ్ నుంచి వెళ్లినవారే అత్యధికం. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ల నుంచి వ్యవసాయ కూలీలు పంజాబ్, హరియాణాలకు వెళ్తుంటారు. అన్ని మహా నగరాల్లో ఇంటి పనిమనుషుల్లో ఎక్కువ మంది ఇతరచోట్ల నుంచి వలస వచ్చినవారే. స్థానికులు చేయడానికి ఇష్టపడని పనులను వలస కార్మికులు చేస్తుంటారు. అలాగే స్థానికంగా గిరాకీకి తగిన సంఖ్యలో సిబ్బంది దొరకనప్పుడూ వలస సిబ్బందే శరణ్యం. వీరికి గిరాకీ పెరుగుతోందంటే అర్థం- దేశాభివృద్ధి జోరందుకుంటోందని... దేశం ఉమ్మడి మార్కెట్‌గా బలపడుతోందని నిర్ధారణ అవుతుంది. ఈ సహజ పరిణామాన్ని అడ్డుకోవడం ఎవరికీ క్షేమకరం కాదు!
-పరిటాల పురిషోత్తం (రచయిత-సామాజిక ఆర్థిక విశ్లేషకులు)